పార్లమెంట్ లో తుక్కు తుక్కు కొట్టుకున్న ఎంపీలు.. ఎక్కడంటే..?

తుర్కియే (Turkey) పార్లమెంట్ లో శుక్రవారం అధికార, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం దాడులు చేసుకున్నారు.

Update: 2024-08-16 23:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: తుర్కియే (Turkey) పార్లమెంట్ లో శుక్రవారం అధికార, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం దాడులు చేసుకున్నారు.దాదాపు డజన్ల కొద్దీ ఎంపీలు ఒకరినొకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు. ఈ ఘర్షణలో అధికార పార్టీకి చెందిన మహిళా ఎంపీ తీవ్రంగా గాయపడినట్లు, అలాగే ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యుడు కూడా గాయపడినట్లు సమాచారం.వివరాల్లోకెళ్తే.. 2013లో టర్కీ ప్రధానిగా ఉన్న ఎర్డోగన్ పాలనను వర్కర్స్‌ పార్టీ నేత క్యాన్‌ అటలే (Can Atalay) అనేక సార్లు సవాలు చేశాడు. దీంతో 2013లో ఎర్డోగన్ పాలనకు వ్యతిరేకంగా అనేక నిరసనలు జరిగాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు కారణం క్యాన్‌ అటలే కారణమని తెలుపుతూ టర్కీ రాజ్యాంగ కోర్ట్ పోయిన సంవత్సరం అతనికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో క్యాన్‌ అటలే గత సంవత్సరం నుండి జైలు శిక్షను అనుభవిస్తున్నారు.



అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో క్యాన్‌ అటలే పార్లమెంటు డిప్యూటీగా ఎన్నికయ్యారు.పార్లమెంటుకు హాజరయ్యేందుకు తనకు అవకాశం ఇవ్వాలని,పదవీకాలం ముగియగానే మళ్లీ జైలుకు వెళ్తానని కోరుతూ క్యాన్‌ అటలే ఇటీవల కోర్టును ఆశ్రయించాడు.ఈ మేరకు రాజ్యాంగ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై శుక్రవారం పార్లమెంటులో జరిగిన చర్చ భౌతిక దాడులకు దారి తీసింది. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఓజ్‌గుర్ ఓజెల్ మాట్లాడుతూ.. ఎంపీలు కొట్టుకోవడం సిగ్గుచేటు పరిస్థితని, పార్లమెంట్ లో మాటలకు బదులు పిడికిలి ఎగురుతోందని , నేలపై రక్తం పారుతోందని, మహిళా ఎంపీలను కనికరం లేకుండా కొడుతున్నారని విమర్శించారు. అయితే టర్కీ చట్టసభ సభ్యుల మధ్య శారీరక గొడవలు జరగడం ఇదే మొదటిసారేం కాదు ఇంతకముందు కూడా పలు సందర్భాల్లో ఎంపీలు ఒకరినొకరు గుద్దుకున్న ఘటనలు చాలా ఉన్నాయి.






 



Similar News