USA Gun Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. అక్కడికక్కడే తెలుగు వైద్యుడు మృతి..!
అమెరికాలో కాల్పుల సంస్కృతి కొనసాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో కాల్పుల సంస్కృతి కొనసాగుతోంది. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.తుపాకీ కాల్పుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా శుక్రవారం సాయంత్రం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏపీకి చెందిన డాక్టర్ మృతిచెందిన ఘటన వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేశ్‌బాబు (64) శుక్రవారం దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.అమెరికాలోని అలబామా రాష్ట్రంలో వైద్య వృత్తి చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.పలు చోట్ల ఆసుపత్రులు నిర్మించి ఎంతో మందికి ఉపాధి కల్పించాడు . ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఓ వీధికి అతని పేరు పెట్టారని సమాచారం.
రమేశ్‌బాబు తిరుపతి ఎస్‌వీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేసిననంతరం పోస్టు గ్రాడ్యూషన్ కోసం విదేశాలకు వెళ్లాడు. జమైకాలో ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అమెరికాలో వైద్యడిగా స్థిరపడ్డారు. కాగా ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రమేష్ బాబు కరోనా సమయంలో చాలా సేవలందించారు. తాను చిన్నప్పుడు చదువుకున్న మేనకూరు పాఠశాలకు గతంలో రూ.14 లక్షల విరాళం ఇచ్చారు. అంతేకాకుండా ఆయన స్వగ్రామం మేనకూరలో సాయిబాబా నిర్మాణానికి రూ.20 లక్షల విరాళం ఇచ్చారు. ఈనెల 15న నాయుడుపేటలో బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ అంతలోనే మృతి చెందారన్న వార్త కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అతని మరణవార్తతో స్వగ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.