Gaza: గాజాలో ముగిసిన మొదటి దశ పోలియో వ్యాక్సినేషన్

ఇజ్రాయెల్ దాడులతో అల్లాడిపోతున్న గాజాలో ఇటీవల పోలియో కారక వైరస్ జాడలు కనుగొన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ

Update: 2024-09-05 03:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ దాడులతో అల్లాడిపోతున్న గాజాలో ఇటీవల పోలియో కారక వైరస్ జాడలు కనుగొన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మొదటి దశను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది. దాదాపు 2,00,000 మంది పిల్లలకు ప్రారంభ వ్యాక్సిన్‌ను అందించింది. కనుమరుగు అయిన పోలియో వైరస్ జాడలు 25 సంవత్సరాల తరువాత మొదటిసారిగా వెలుగు చూడటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మానవతా సాయంగా యుద్ధానికి విరామం ఇవ్వాలని ఆ సమయంలో టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని విజ్ఞప్తి చేయగా, అందుకు ఇజ్రాయెల్ అంగీకరించడంతో ఆదివారం నుంచి అక్కడి పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించారు.

దాదాపు 11 నెలల యుద్ధంలో నాశనమైన ఈ ప్రాంతంలో ఉన్న 6,40,000 కంటే ఎక్కువ మంది పిల్లలకు పూర్తిగా టీకాలు వేయడం దీని లక్ష్యం. సెంట్రల్ గాజాలో సెప్టెంబర్ 1 నుంచి 3 మధ్య నిర్వహించిన కార్యక్రమంలో, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 1,87,000 మంది పిల్లలకు టీకా అందించినట్టు WHO ఒక ప్రకటనలో తెలిపింది. గాజా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ముమ్మరంగా ప్రచారం చేయడం వలన అన్ని కుటుంబాలు, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు అంకితభావంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సోషల్ మీడియా ఎక్స్‌లో తెలిపారు.

దాదాపు 2,200 మంది ఆరోగ్య, కమ్యూనిటీ ఔట్రీచ్ వర్కర్లతో కూడిన 500 కంటే ఎక్కువ బృందాలు సెంట్రల్ గాజాలో టీకాను అందిస్తున్నాయి. అక్కడి ప్రాంతంలో 143 సైట్‌లను పూర్తిగా టీకాలు అందించడానికి ఏర్పాట చేశారు. అలాగే, వ్యాక్సినేషన్ సెంటర్ చేరుకోలేని వారి కోసం మొబైల్ బృందాలే నేరుగా వారి వద్దకు వెళుతూ టీకాను అందిస్తున్నాయి. అక్కడి ఉన్న పిల్లలందరికీ ఖచ్చితంగా టీకాను అందిస్తామని సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు.


Similar News