కావాలనే ఫేక్ వీడియోలను వ్యాప్తి చేస్తున్నారు: వైట్‌హౌస్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వయస్సు రీత్యా జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలను గత కొంత కాలంగా ఎదుర్కొంటున్నట్లు పలు సంఘటనల ద్వారా తెలుస్తుంది

Update: 2024-06-18 08:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వయస్సు రీత్యా జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలను గత కొంత కాలంగా ఎదుర్కొంటున్నట్లు పలు సంఘటనల ద్వారా తెలుస్తుంది. ఇటీవల ఇటలీలో జరిగిన G7 సమ్మిట్ సందర్భంగా ప్రపంచ నాయకులందరూ గ్రూప్ ఫొటోకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో బైడెన్ అక్కడ ఉండకుండా ఎటువైపో చూస్తూ ముందుకు వెళ్లిపోయారు. వేరెవరితోనో మాట్లాడుతూ కనిపించారు. ఫొటో దిగడానికి ఆయన రాకపోవడంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని బైడెన్ చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చారు, ఆ తరువాత అందరూ కలిసి ఫొటో దిగారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో బైడెన్ ఆరోగ్య స్థితిపై ఆందోళనలు లేవనెత్తుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ వీడియోలపై తాజాగా వైట్‌హౌస్ స్పందించింది. అధ్యక్షుడి మానసిక స్థితిపై రిపబ్లికన్లు కావాలనే ఈ ఫేక్ వీడియోలను వ్యాప్తి చేశారని ఆరోపించింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ విలేకరులతో మాట్లాడుతూ, పూర్తి వీడియోను కాకుండా ఎడిట్ చేసి క్లిప్‌లను రిపబ్లికన్లు సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. పూర్తి వీడియోను చూస్తే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది, ఉద్దేశపూర్వకంగానే వారు వీడియోలను ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు. రిపబ్లికన్‌లు ఎంత నిరాశకు గురవుతున్నారో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. బైడెన్ ఆరోగ్య స్థితి బాగానే ఉందని ఆయన ఎలాంటి మానసిక సమస్యలను ఎదుర్కొవడం లేదని ప్రెస్ సెక్రటరీ అన్నారు.

మరోవైపు బైడెన్ ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు గతంలో చాలా సందర్భాల్లో ఆయన విచిత్రంగా ప్రవర్తించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. అయితే ప్రచారంలో భాగంగా రిపబ్లికన్లు బైడెన్ మతిమరుపుతో బాధపడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులకు బైడెన్ మానసిక స్థితి ప్రచారాస్త్రంగా మారింది.


Similar News