అండం.. వీర్యం..రెండూ లేకుండానే కృత్రిమ పిండం..

స్త్రీ అండం.. పురుష వీర్యం.. ఇవి రెండూ కలిసి ఫలదీకరణ జరిగితేనే “పిండం” ఏర్పడుతుంది.

Update: 2023-06-16 11:27 GMT

వాషింగ్టన్: స్త్రీ అండం.. పురుష వీర్యం.. ఇవి రెండూ కలిసి ఫలదీకరణ జరిగితేనే “పిండం” ఏర్పడుతుంది. కానీ పురుష వీర్యం.. స్త్రీ అండం లేకుండా కేవలం స్టెమ్ సెల్స్ (మూల కణాల) తో కృత్రిమ పిండాన్ని అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తల ఉమ్మడి టీమ్ అభివృద్ధి చేసింది. స్టెమ్ సెల్స్ అంటే కండర కణాలు, రక్త కణాలు, మెదడు కణాలు వంటి శరీరంలోని అనేక రకాల ప్రత్యేక కణాలు. ఈ కణాలలో పునరుత్పత్తి అయ్యే సామర్ధ్యం ఉంది. ఇవి వాటికి అవిగా విభజన చెంది..తమను తాము పునరుద్ధరించుకోగలవు. ఈ స్టెమ్ సెల్స్ కణాలే మానవ శరీరానికి మరమ్మతు వ్యవస్థగా పనిచేస్తాయి. మనిషి పుట్టుకపై జన్యుపరమైన రుగ్మతల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి.. గర్భస్రావాలు కొందరికి ఎక్కువగా జరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఈ కృత్రిమ పిండం కొత్త బాటలు వేయనుంది.

అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న “ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్” వార్షిక సమావేశంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన వివరాలను వెల్లడించారు. ఈ కృత్రిమ పిండంలో మావి(ప్లాసెంటా) కణాలు, గర్భస్థ పిండం పై పొర (యోక్ శాక్)లోని కణాలు , పిండాన్ని ఏర్పరిచే కణాలు ఉంటాయని చెప్పారు. అయితే ఇందులో సజీవమైన గుండె నిర్మాణానికి అవసరమైన కణాలు కానీ.. మెదడు నిర్మాణానికి అవసరమైన 3 మిల్లీ మీటర్ల న్యూరల్ ట్యూబ్ కానీ ఉండదని స్పష్టం చేశారు.

పిండ (ఎంబ్రయో) మూలకణాల రీప్రొగ్రామింగ్ ద్వారా మానవ పిండం లాంటి నమూనాలను సృష్టించవచ్చని వారు చెప్పారు. అయితే తాము అభివృద్ధి చేసిన సింథటిక్ పిండాలను వైద్యపరంగా ఉపయోగించుకునే అవకాశం లేదని, వాటిని మహిళల గర్భంలోకి ప్రవేశపెట్టడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఈ కృత్రిమ పిండంలోని కణాల నిర్మాణాలు పరిపక్వం చెందగలవా..? లేదా..? అనేది ఇంకా తెలియదన్నారు.


Similar News