ఉక్రెయిన్ డ్రోన్‌లను కూల్చివేసిన రష్యా
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడానికి ప్రపంచ దేశాలు ఎంత ప్రయత్నించినప్పటికీ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి దాడి చేస్తూనే ఉన్నాయి
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడానికి ప్రపంచ దేశాలు ఎంత ప్రయత్నించినప్పటికీ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి దాడి చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ రష్యాలోని మిలిటరీ హెడ్‌క్వార్టర్స్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్‌లతో దాడి చేయగా వాటిని అడ్డుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 87 డ్రోన్‌లను ఉక్రెయిన్ ప్రయోగించగా వాటిని నేలమట్టం చేసినట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు. 70 డ్రోన్‌లు రోస్టోవ్ పైన, కుర్స్క్, వొరోనెజ్ మీదుగా ఆరు డ్రోన్లను, ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న వోల్గోగ్రాడ్, బెల్గోరోడ్ ప్రాంతంపై ఒక్కొక్క దాన్ని కూల్చివేసినట్లు వారు తెలిపారు.
రోస్టోవ్‌లో ఎటువంటి మానవ ప్రాణనష్టం జరగలేదు, అయితే ఈ దాడుల కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడం వలన సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు ప్రాంతీయ గవర్నర్ వాసిలీ గోలుబెవ్ టెలిగ్రామ్‌లో తెలిపారు. డొనెట్స్క్ ప్రాంతంలోని ఫ్రంట్‌లైన్ పట్టణం సెలిడోవ్‌పై జరిగిన దాడిలో ఆరుగురు గాయపడ్డారని దాని గవర్నర్ తెలిపారు. అలాగే, ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న వోరోనెజ్‌లో, శిధిలాలు పడటం వల్ల ఇంధన రిజర్వాయర్ కొద్దిగా దెబ్బతిన్నదని దాని ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. అదే సమయంలో, ఉక్రేనియన్ వైమానిక రక్షణ వ్యవస్థలు 31 రష్యన్ డ్రోన్‌లలో 24 క్షిపణులను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.