President: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తుతం ఫిజీ దేశ పర్యటనలో ఉన్నారు.

Update: 2024-08-06 15:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తుతం ఫిజీ దేశ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజీ’ని రాష్ట్రపతి అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రతు విలియమ్‌ మైవలిలీ కటోనివేర్‌ ఈ పురస్కారాన్ని ఆమెకు అందించారు. ఈ క్రమంలో ఫిజియన్ పార్లమెంటులో నాయకులను ఉద్దేశించి ముర్ము మాట్లాడుతూ, ప్రపంచ వేదికపై భారతదేశం బలంగా ఉద్భవించినందున, ఫిజీని బలమైన, దృఢమైన, మరింత సంపన్నమైన దేశంగా నిర్మించడానికి భారత్ అండగా ఉంటుందని అన్నారు.

ఆరోగ్య సంరక్షణ, తయారీ, పరిశోధన, పునరుత్పాదక ఇంధనంతో సహా వివిధ రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం పెరుగుతూనే ఉందని, భారత్- ఫిజీ మధ్య సన్నిహిత బంధం ఉందని ముర్ము పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య భౌతిక దూరం ఉన్నప్పటికీ వ్యవసాయం, సామర్థ్య పెంపుదల, వాతావరణ మార్పు, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ భాగస్వామ్యం, విద్య, SMEల రంగంలో మా సహకారం ఫిజీకి అందుతుందని స్పష్టం చేశారు. అలాగే, ఫిజి నుండి మిగతా ప్రపంచం చాలా నేర్చుకోవలసి ఉందని, ఇక్కడి ప్రజల సున్నితమైన జీవన విధానం, సంప్రదాయాలు, ఆచారాలను ఆమె ప్రశంసించింది.

ప్రపంచాన్ని జీవించడానికి మెరుగైన ప్రదేశంగా మార్చడంలో ఫిజీ సహకారం ఉండాలని ఆమె అన్నారు. ఇంకా అత్యున్నత పౌర పురస్కారం పొందడంపై ముర్ము మాట్లాడుతూ, ఈ గౌరవం "రెండు దేశాల మధ్య లోతైన స్నేహ సంబంధాలకు ప్రతిబింబం" అని అభివర్ణించారు. అలాగే, దాదాపు 10 ఏళ్ల క్రితం ఫిజీ పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలను గుర్తుచేశారు. పరిమాణంలో తేడాలు ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య చాలా సారూప్యత ఉందని ముర్ము అన్నారు.

Tags:    

Similar News