నకిలీ పత్రాలతో అమెరికా వెళ్లాలని మహిళ ప్రయత్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు
అగ్రరాజ్యం అమెరికా వెళ్లి చదువుకోవాలని చాలా మంది కలలు కంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా వెళ్లి చదువుకోవాలని చాలా మంది కలలు కంటారు. కానీ అందులో కొందరే ఆ కలల్ని నిజం చేసుకుంటారు.అయితే ఆ కలల్ని సాకారం చేసుకోడానికి చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా ఆ కోవకే చెందిన ఓ మహిళ బాగోతం బయట పడింది. అమెరికా స్టూడెంట్ వీసా పొందేందుకు నకిలీ పత్రాలు ఉపయోగించి ఎంబసీ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. వివరాల్లోకెళ్తే.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన జషన్‌దీప్ కౌర్ అనే మహిళ కొన్ని రోజుల క్రితం నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసింది. ఆమె ఆన్‌లైన్ వీసా దరఖాస్తులో తాను అక్టోబర్ 19, 2020 నుండి జూలై 31, 2022 వరకు హర్యానాలోని కపూర్ అసోసియేట్స్‌లో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నానని పేర్కొంది.
అయితే.. జషన్‌దీప్ కౌర్ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ కోసం ఢిల్లీలోని US ఎంబసీకి వెళ్ళింది. అయితే ఎంబసీ అధికారులతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె బాగోతం బయటపడింది. ఆమె అసలు ఉద్యోగం చేయలేదని కానీ ఉద్యోగం చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించిందని ఎంబసీ అధికారులు కనిపెట్టారు. దీంతో నిందితురాలు తన తప్పును ఒప్పుకుంది. నకిలీ ఉద్యోగ పత్రాలను తన తండ్రి స్నేహితుడు అయిన జస్వంత్ సింగ్ నుండి పొందానని జషన్‌దీప్ కౌర్ అంగీకరించింది. కర్నాల్ లోని కెసి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి చెందిన వంశిక సింగ్ ద్వారా తాను అమెరికా స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఒకవేళ తనకు వీసా వస్తే తాను వంశిక సింగ్‌కి రూ. 1.5 లక్షలు చెల్లిస్తానని ఒప్పందం కుదర్చుకున్నట్లు కౌర్ తెలిపింది.భారతదేశంలోని యుఎస్ ఎంబసీని, యుఎస్ ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ప్రయత్నించినందుకు జషన్‌దీప్ కౌర్‌పై అమెరికా ఎంబసీ బుధవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా నిందితురాలు జషన్‌దీప్ కౌర్‌పై ఢిల్లీ పోలీసులు చాణక్యపురి పోలీస్ స్టేషన్ లో భారతీయ న్యాయ్ సంహిత (BNS) సెక్షన్ 318(4), 336(3), 340 (2), మరియు 61 (2) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.