నాలుగు లక్షల అఫ్గానిస్తాన్ పౌరులకు పాకిస్థాన్ షాక్!
అనధికారికంగా నివసిస్తున్న అఫ్గాన్ పౌరులకు పాకిస్తాన్ షాక్ ఇచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: అనధికారికంగా నివసిస్తున్న అఫ్గాన్ పౌరులకు పాకిస్తాన్ షాక్ ఇచ్చింది. సరైన అనుమతులు లేకుండా పాకిస్తాన్‌లో నివసిస్తున్న 4లక్షల అఫ్గాన్ పౌరులను స్వదేశానికి పంపించి వేసినట్లు తాజాగా వెల్లడించింది. అయితే పాకిస్తాన్ ఇటీవల అనుమతులు లేకుండా తమ దేశంలో నివసిస్తున్న అఫ్గానీయులు నవంబర్ 1 నాటికి దేశం విడిచిపోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. 1980లో సోవియట్ యూనియన్ ఆక్రమణ టైంలో లక్షలాది మంది అఫ్గాన్ పౌరులు పాకిస్తాన్‌కు వలస వెళ్లారు.
2021లో అమెరికా దళాలు ఆ దేశాన్ని విడిచి వెళ్లాయి. ఆ సమయంలో తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను కైవసం చేసుకునే సమయంలో ఈ వలసల సంఖ్య వీపరీతంగా పెరిగింది. దాదాపు 17లక్షల మంది పాకిస్తాన్ వలస వెళ్లారు. సరైన పత్రాలు లేని వారిని పాకిస్తాన్ తమ దేశానికి వెళ్లిపోవాలని ఇటీవల గడువు విధించింది. గడువు తీరినా కొంత మంది దేశాన్ని వీడకపోవడంతో ఇటీవల ఇంటింటికి తిరుగుతూ అక్కడి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. పట్టుబడిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలిస్తున్నారు.