స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు..ఏ దేశంలో అంటే?

థాయ్‌లాండ్‌లో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత లభించింది. ఈ బిల్లుపై మంగళవారం థాయ్ పార్లమెంట్‌లో ఓటింగ్ జరగగా..152 మంది సభ్యులు హాజరుకాగా..130 మంది ఎంపీలు అనుకూలంగా, నలుగురు వ్యతిరేకంగా ఓటు వేశారు.

Update: 2024-06-18 17:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: థాయ్‌లాండ్‌లో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత లభించింది. ఈ బిల్లుపై మంగళవారం థాయ్ పార్లమెంట్‌లో ఓటింగ్ జరిగింది. 152 మంది సభ్యులు సభకు హాజరుకాగా..130 మంది ఎంపీలు అనుకూలంగా, నలుగురు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరికొందరు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ బిల్లు ఆమోదం కోసం కింగ్ మహా వజిరాలాంగ్‌కార్న్‌కి పంపిస్తారు. అక్కడ అనుమతి పొందిన తర్వాత ప్రభుత్వం గెజిట్ విడుదల చేస్తుంది. అనంతరం120 రోజుల లోపు ఈ చట్టం అమలులోకి వస్తుంది. ఆసియాలో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించిన మూడో దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది. అంతకుముందు తైవాన్, నేపాల్ దేశాలు కూడా దీనిని చట్టబద్ధం చేశాయి.

కాగా, థాయ్‌లాండ్‌లో గే వివాహాలను చట్టబద్ధం చేయాలనే డిమాండ్‌ 20 ఏళ్లుగా ఉంది. ప్రస్తుతం ఈ చట్టం అమలు చేసిన తర్వాత18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్వలింగ సంపర్కులు ఎవరైనా వివాహం చేసుకోవచ్చు. గతంలో ఫిబ్రవరిలో ఈ బిల్లును పార్లమెంటు ముందుంచారు. అయితే ఆ తర్వాత ఎంపీలు తిరస్కరించారు. తాజాగా థాయ్‌ ప్రధాని శ్రేతా తవిసిన్‌ చొరవతో ఎట్టకేలకు బిల్లు ఆమోదం పొందింది. చట్టాన్ని ఆమోదించడంపై ఫోర్టిఫై రైట్స్‌కు చెందిన మూక్‌దపా యాంగ్యుఎన్‌ప్రడోర్న్ స్పందించారు. ఇది న్యాయం, హుమన్ రైట్స్ విజయంగా అభివర్ణించారు.   


Similar News