West Bank: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ నుంచి వెనక్కి మళ్లిన ఇజ్రాయెల్ దళాలు

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ నగరం నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి మళ్లాయి.

Update: 2024-09-07 04:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ నగరం నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి మళ్లాయి. సైనిక ఆపరేషన్ ప్రారంభించిన తొమ్మిది రోజుల తరువాత వారు దాడులను ముగించారు. సమాచారం ప్రకారం, శుక్రవారం జెనిన్, తుల్కరేమ్ నుండి సైన్యం ఉపసంహరించుకుంది. గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్ బ్యాంక్‌కు నిరంతరంగా సైనిక దళాలను పంపిస్తూ దాడులు చేస్తుంది. ఇటీవల దాడుల్లో 36 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో తొమ్మిది మంది తీవ్రవాదులు, ఎనిమిది మంది పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఒక్క జెనిన్‌ నగరంలోనే దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.

ఇజ్రాయెల్ భద్రతా దళాలు ఆగష్టు 28న ఉత్తర వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్, తుల్కరేమ్, టుబాస్‌లలో "ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్" మొదలెట్టాయి. గత అక్టోబర్‌లో యుద్దం మొదలైనప్పటి నుండి వెస్ట్ బ్యాంక్‌లో దాదాపు 700 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, వీరిలో తీవ్రవాదులతో పాటు చాలా మంది సామాన్య ప్రజలు కూడా ఉన్నారని రమల్లాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ దళాల దాడుల్లో వెస్ట్ బ్యాంక్‌లోని 1,478 నిర్మాణాలు ధ్వంసం కాగా, 70% కంటే ఎక్కువ క్లిష్టమైన మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇజ్రయెల్ దళాలు వెనక్కి మళ్లినప్పటికి జెనిన్‌లో మొత్తం ఆపరేషన్ ముగియలేదు, ఇది తాత్కాలిక విరామం మాత్రమే అని వారు చెప్పినట్లు సమాచారం.


Similar News