బ్రెజిల్‌లో ఆగని వర్షాలు..145కు చేరిన మృతుల సంఖ్య

ఉత్తర అమెరికా దేశం బ్రెజిల్‌లో గత రెండు వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు పలు ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 145కు చేరుకుంది.

Update: 2024-05-13 06:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర అమెరికా దేశం బ్రెజిల్‌లో గత రెండు వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు పలు ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 145కు చేరుకుంది. అలాగే మరో 132 మంది అదృశ్యమైనట్టు ఆ దేశ పౌర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా వర్షాల వల్ల రియో ​​గ్రాండే దో సుల్ రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైనట్టు పేర్కొంది. వరద భారీగా వస్తుండటంతో నదులన్నీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో 6,19,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అత్యవసర వ్యయాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

ఈ సందర్భంగా బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా డా సిల్వా మాట్లాడుతూ..త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూస్తామని తెలిపారు. తీవ్ర వర్షాల కారణంగా ‘అన్నీ తిరిగి పొందలేమని మాకు తెలుసు, తల్లులు తమ పిల్లలను కోల్పోయారు. పిల్లలు తమ తల్లులను కోల్పోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేశామని స్పష్టం చేశారు. అయితే భారీ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. బ్రెజిల్‌లోని పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. బ్రెజిల్‌కు సహాయం అందించడానికి అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. 

Tags:    

Similar News