Nigeria: నైజీరియాలో బైకులపై వచ్చి కాల్పులు.. 100 మందికి పైగా మృతి

నైజీరియాలో తీవ్ర విచారకర ఘటన చోటుచేసుకుంది.

Update: 2024-09-04 13:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నైజీరియాలో తీవ్ర విచారకర ఘటన చోటుచేసుకుంది. అనుమానిత బోకోహరమ్ ఇస్లామిక్ తీవ్రవాదులు 50 మందికి పైగా బైకులపై వచ్చి యోబే రాష్ట్రంలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలోకి ప్రవేశించి, అక్కడి మార్కెట్లు, ప్రార్థన స్థలాల్లో భక్తులు, ప్రజల ఇళ్లపై కాల్పులు జరపడంతో దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్ర వాదులు పలు భవనాలకు నిప్పు అంటించడంతో పాటు కనిపించిన వారిని కనిపించినట్టుగా కాల్చి చంపేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 102 మంది గ్రామస్తులు మరణించినట్లు ధృవీకరించారు. అయితే ఈ మరణాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని స్థానిక పోలీసులు తెలిపారు.

2009 నుండి ఈ ప్రాంతంలో బోకోహరామ్‌ దాడులు చేస్తూనే ఉంది. ఈ సంవత్సరం వీరు జరిపిన దాడి కారణంగా 1,500 మంది మరణించారు. యోబే డిప్యూటీ గవర్నర్ ఇడి బర్డే గుబానా మాట్లాడుతూ, మృతదేహాల ఖననం కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అధికారులు రాకముందే చాలా మందిని ఖననం చేశారు. ఇంకా మిస్ అయిన వారు కూడా ఉన్నారు. వారి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.

తమ కార్యకలాపాల గురించి పోలీసులకు గ్రామస్థులు తెలియజేసినందుకు ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడినట్లు ఉగ్రవాదులు ప్రకటించారని స్థానిక మీడియా పేర్కొంది. గ్రామస్థులు అందించిన సమాచారంతో చాలా మంది బోకోహరమ్ తీవ్రవాదులు మరణించారని మిలిటెంట్లు పేర్కొన్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు గతంలో బోకోహరామ్‌తో వివాదాన్ని ముగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే వరుసగా జరుగుతున్న ఈ దాడులను అరికట్టడంలో ఆయన విఫలం కావడంతో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు.


Similar News