పగలు తిరిగే గుడ్లగూబ..?! నిజమే, తాజాగా ఇక్కడ దొరికింది!
గుడ్లగూబలకు అసలు పగలు కళ్లే కనిపించవని మనకి తెలుసు. First ever fossil of daytime active owl found in China.
దిశ, వెబ్‌డెస్క్ః గుడ్లగూబ గురించి మనందరికీ తెలుసు. దీన్ని పగలు చూడటం చాలా అరుదుగా జరుగుతుంది. అంతేందుకు, అసలు గుడ్లగూబలకు పగలు కళ్లే కనిపించవని మనకి తెలుసు. అందుకే, మనుషులకు దూరంగా, రాత్రి వేళల్లో మాత్రమే కనిపించే ఈ జీవులు ఆహారం కోసం గానీ, మరే ఇతర అవసరాల కోసమైనా రాత్రుళ్లు మాత్రమే సంచరిస్తాయని మనం అనుకుంటున్నాము. వాస్తవానికి, మనకి తెలిసినంత వరకే ఇది ఇలాగే ఉంటుందనే గట్టి అభిప్రాయం ఉన్నప్పటికీ, పగలు కూడా తిరిగే గుడ్లగూబలు ఉన్నాయని ఇటీవల పరిశోధనల్లో తేలింది. టిబెటన్ పీఠభూమిలో చాలా కాలం క్రితం అంతరించిపోయిన గుడ్లగూబకు చెందిన శిలాజ అస్థిపంజరం ఒకటి బయటపడింది. ఈ జాతి గుడ్లగూబలు పగటి వేళల్లో కూడా రోజూ వేటాడేవని దాని ద్వారా వెల్లడయ్యింది. ఈ పరిశోధన వల్ల గుడ్లగూబ పరిణామంపై మన అవగాహనలో ఇప్పటి వరకూ ఉన్న అభిప్రాయంలో కాస్త మార్పు చోటుచేసుకుంటుంది.
చైనాలోని శాస్త్రవేత్తల బృందం చైనాలోని లేట్ మియోసీన్ యుగంలో ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి, అంతరించిపోయిన గుడ్లగూబ శిలాజ అస్థిపంజరాన్ని కనుగొన్నారు. దాదాపు 2,100 మీటర్ల (7,000 అడుగులు) ఎత్తులో ఉన్న టిబెటన్ పీఠభూమి అంచున, చైనాలోని గన్సు ప్రావిన్స్‌లోని లిన్క్సియా బేసిన్‌లో ఈ శిలాజాన్ని కనుగొన్నారు. ఈ గుడ్లగూబ జాతికి 'మియోసూర్నియా డైర్నా' అని పరిశోధకుల బృందం పేరు పెట్టింది. ఉత్తర హాక్ గుడ్లగూబ 'సుర్నియా ఉలులా' కూడా పగటిపూట చురుకుగా ఉండే మధ్యస్థ-పరిమాణ జాతి గనుక దానికి దగ్గరగా ఈ పేరు పెట్టారు. ఇక, ఈ శిలాజపు అత్యంత విశేషమైన లక్షణం, అది అంత అద్భుతంగా పరిరక్షింపబడిన స్థితిలో ఉండటం. అందుకే, ఈ పరిశోధనలో ముఖ్యులైన డాక్టర్ లి, డాక్టర్ స్టిదామ్‌లు ఈ గుడ్లగూబ పగటిపూట చురుగ్గా ఉండేదని నిర్ధారించడానికి అవకాశం దొరికింది. ఈ గుడ్లగూబలోని పుర్రె కంటి సాకెట్‌లో భద్రపరచిన స్క్లెరల్ ఓసికల్స్ అని పిలువబడే శిలాజ కంటి ఎముకలను అధ్యయనం చేసినప్పుడు ఇది మిగిలిన పక్షుల్లా పగటి వేళ తిరిగేదని వారికి అర్థమయ్యింది.