దక్షిణ గాజాలో పేలుడు.. 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి నెలకొల్పడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి నెలకొల్పడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ నిరంతరం రఫాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూనే ఉంది. అయితే శనివారం దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ సైనిక వాహనంపై బాంబు దాడులు జరగ్గా పేలుడులో ఎనిమిది మంది సైనికులు మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స కోసం తరలించామని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. అలాగే, ఇది ఇటీవల నెలల్లో హమస్ జరిపిన అత్యంత ఘోరమైన దాడిగా ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడి తరువాత ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్‌కు దక్షిణాన ఉన్న రఫాలో డజన్ల కొద్దీ ఇళ్లను తగలబెట్టి, నేలమట్టం చేశాయి.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, రఫాలో సైనికులను చంపిన హమాస్ ఆకస్మిక దాడి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ నెల ప్రారంభంలో కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆవిష్కరించారు, దీనికి ఐక్యరాజ్య సమితి కూడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు హమాస్ షరతులతో కూడిన కాల్పుల విరమణకు, బందీల విడుదలకు అంగీకరించింది. అయితే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్ సైనిక, పాలక సామర్థ్యాలను నాశనం చేసే వరకు యుద్ధాన్ని ఆపబోనని చెప్పారు.
అయినప్పటికి అతి త్వరలో ఆ దేశ ప్రధాని కాల్పులు విరమణకు అంగీకరించే అవకాశం ఉందని పలువురు నేతలు పేర్కొంటున్నారు. అక్టోబర్ 7 నుంచి గాజాపై ఇజ్రాయెల్ చేసిన యుద్ధంలో కనీసం 37,296 మంది మరణించారు, 85,197 మంది గాయపడ్డారు. యుద్ధం మూలంగా గాజాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా 50,000 మంది చిన్నారులు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని పాలస్తీనియన్ శరణార్థుల UN ఏజెన్సీ (UNRWA) హెచ్చరించింది.