ఎర్రసముద్రంలో సంక్షోభం ఆందోళనకరం: ఇరాన్ పర్యటనలో విదేశాంగ మంత్రి జైశంకర్
ప్రస్తుతం ఎర్ర సముద్రంలో నెలకొన్న సంక్షోభంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం ఎర్ర సముద్రంలో నెలకొన్న సంక్షోభంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ పర్యటనలో ఉన్న ఆయన రాజధాని టెహ్రాన్‌లో ఇరాన్ కౌంటర్ హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్‌కు సమీపంలోని నౌకలపై దాడులు చేయడం అంతర్జాతీయ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. ఈ తరహా చర్యలు భారతదేశ ఇంధనం, ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయన్నారు. దీనివల్ల ఎవరికీ ప్రయోజనం లేదని చెప్పారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించుకోవడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ‘ఎర్ర సముద్రంలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఉత్తర, మధ్య అరేబియా సముద్రంతో సహా కీలకమైన సముద్ర మార్గాల్లో భద్రతా కార్యకలాపాలకు భారత నావికాదళం ఇప్పటికే నౌకలను విస్తరించింది’ అని చెప్పారు. అంతర్జాతీయ జలమార్గాల్లో భద్రత కల్పించడం చాలా ముఖ్యమని ఇరాన్ కౌంటర్ అమీర్ తెలిపారు.