దక్షిణ చైనా సముద్రంలో అమల్లోకి వచ్చిన చైనా కొత్త నియమాలు
గత కొన్నేళ్లుగా దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాకు పాశ్చాత్య దేశాల మధ్య వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే
దిశ, నేషనల్ బ్యూరో: గత కొన్నేళ్లుగా దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాకు పాశ్చాత్య దేశాల మధ్య వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిలిప్పీన్స్‌తో సహా అనేక ఆగ్నేయాసియా దేశాలకు చెందిన షిప్‌లు తరుచుగా వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో సంచరిస్తుండగా చైనా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దక్షిణ చైనా సముద్రం మొత్తం కూడా తమదే అని, దానిపై సర్వహక్కులు తమకే లభిస్తాయని చైనా పేర్కొంటుండగా, దీనిని ఫిలిప్పీన్స్‌తో సహా ఇతర దేశాలు ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో చైనా ఇటీవల కొత్తగా కోస్ట్ గార్డ్ నియమాలను తీసుకొచ్చింది. ఇవి శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి.
దీంతో నిబంధనలకు విరుద్ధంగా వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించినందుకు విదేశీయులను చైనా తీర రక్షక దళ నౌకలు అదుపులోకి తీసుకుంటాయి. క్లిష్టమైన కేసులో వారిని 60 రోజుల వరకు నిర్బంధంలో ఉంచే అవకాశం ఉంటుంది. చైనా ప్రాదేశిక జలాలు, ప్రక్కనే ఉన్న జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీ నౌకలను అదుపులోకి తీసుకుంటారు. ఈ కొత్త నిబంధలను శనివారం నుండి, ఆన్‌లైన్‌లో ఉంచారు.
ఈ చర్య చైనీస్ కోస్ట్ గార్డ్ అనాగరిక, అమానవీయ ప్రవర్తన అని ఫిలిప్పీన్స్ ఆరోపించింది, అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ మాట్లాడుతూ, కొత్త నిబంధనలు చాలా ఆందోళనకరమైనవని అన్నారు. చైనా తీర రక్షక దళ నౌకలు ఫిలిప్పీన్స్ బోట్లపై అనేకసార్లు నీటి ఫిరంగిని ప్రయోగించాయి. ఇరు పక్షాల సైనికులు ఇటీవల కాలంలో చాలా సార్లు ఘర్షణలు పడ్డారు. ఫిలిప్పీన్స్ మిలిటరీ చీఫ్ జనరల్ రోమియో బ్రానర్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మా మత్స్యకారులను రక్షించుకోవడానికి మేము చేపట్టాల్సిన అనేక చర్యల గురించి చర్చిస్తున్నామని అన్నారు.
చైనా కొత్త నిబంధనలపై G7 కూటమి తీవ్ర విమర్శలు చేసింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా బలవంతపు బెదిరింపు కార్యకలాపాలను మేము వ్యతిరేకిస్తున్నామని శిఖరాగ్ర సమావేశం ముగింపులో అన్నారు. దక్షిణ చైనా సముద్రం వాణిజ్యానికి చాలా ముఖ్యమైన మార్గం. ఏటా ట్రిలియన్ల డాలర్ల ఓడల ద్వారా వ్యాపారం దీని గుండా జరుగుతుంది. అక్కడి సముద్ర గర్భం క్రింద భారీ చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. దీంతో వీటన్నింటిని సొంతం చేసుకోవడానికి చైనా ఈ సముద్ర పరిధి మొత్తం కూడా తమదే అని చెబుతుంది. అయితే దీనిని అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు అంగీకరించడం లేదు.