California temple: అమెరికాలో మరో హిందూ ఆలయంపై దాడి.. పది రోజుల్లోనే రెండో ఘటన

అమెరికాలోని బాప్స్ హిందూ దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

Update: 2024-09-26 05:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో ఉన్న బాప్స్ హిందూ దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అంతేగాక ఆలయంలో హిందూ వ్యతిరేక నినాదాలు కూడా చేసినట్టు బీఏపీఎస్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ తెలిపింది. దాడి సమయంలో నిందితులు హిందూ గో బ్యాక్ స్లోగన్స్ కూడా ఇచ్చినట్టు పేర్కొంది. ద్వేషానికి వ్యతిరేకంగా మేము ఐక్యంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ ఘటనను శాక్రమెంటో అధికారులు సైతం ధ్రువీకరించారు. ఆలయాన్ని ధ్వంసం చేయడమే గాక చుట్టుపక్కల ఉన్న ఓ పైప్ లైన్‌ను పగులగొట్టారని తెలిపారు.

కాగా, గత 10 రోజుల్లో యూఎస్ లో హిందూ ఆలయంపై దాడి జరగడం ఇది రెండో సారి కావడం గమనార్హం. అంతకుముందు ఈ నెల 17న న్యూయార్క్‌లోని స్వామినారాయణ ఆలయంలో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలపై ఇండియా-అమెరికన్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు అజయ్ జైన్ భుటోరియా మాట్లాడుతూ.. భయాన్ని వ్యాప్తి చేసే ఇలాంటి ఘటనలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని దేవాలయాల్లో భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు. ద్వేషానికి వ్యతిరేకంగా శాంతి కోసం ప్రార్థిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. 


Similar News