ఇండోనేషియాలో మరో అగ్ని పర్వతం విస్ఫోటనం: ఐదు కిలోమీటర్ల మేర ఎగిసిపడిన బూడిద
ఇండోనేషియాలోని ఇబు అగ్నిపర్వతం సోమవారం ఉదయం విస్ఫోటనం చెందింది. ఈ టైంలో ఆకాశంలోకి అనేక కిలోమీటర్లు మేర బూడిద వెదజల్లినట్టు ఆ దేశ అగ్నిపర్వత ఏజెన్సీ తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఇండోనేషియాలోని ఐబు అగ్నిపర్వతం సోమవారం ఉదయం విస్ఫోటనం చెందింది. ఈ టైంలో ఆకాశంలోకి అనేక కిలోమీటర్లు మేర బూడిద వెదజల్లినట్టు ఆ దేశ అగ్నిపర్వత ఏజెన్సీ తెలిపింది. రిమోట్ ద్వీపమైన హల్మహెరాలోని ఈ అగ్నిపర్వతం సుమారు ఐదు నిమిషాల పాటు బద్దలైనట్టు తెలిపింది. లావాను 5 కిలోమీటర్ల వరకు వెదజల్లినట్టు వెల్లడించింది. గత శుక్రవారం కూడా చిన్నపాటిగా విస్ఫోటనం చెందినట్టు తెలిపింది. అగ్నిపర్వతం హెచ్చరిక స్థితి ప్రస్తుతం రెండో అత్యధిక స్థాయిలో ఉందని జియోలాజికల్ ప్రమాదాల నివారణ కేంద్రం అధిపతి హెండ్రా గుణవన్ తెలిపారు. దీంతో అగ్ని పర్వతంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో అన్ని కార్యకలాపాలను అధికారులు నిషేధించారు. స్థానికంగా ఉండే ప్రజలకు పలు సూచనలు చేశారు. కాగా, ఇండోనేషియాలో 127 క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇటీవల ఉత్తర సులవేసిలోని రువాంగ్ అగ్నిపర్వతం సైతం విస్ఫోటనం చెందింది. దీంతో 12000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే గత డిసెంబరులో అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటైన మరాపి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో 20 మందికి పైగా మరణించారు.