Donald Trump :అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కేసు నమోదు
'పోర్న్ స్టార్' కేసులో ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తాజాగా మరో షాక్ తగిలింది.
దిశ, డైనమిక్ బ్యూరో: 'పోర్న్ స్టార్' కేసులో ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. రహస్య పత్రాల కేసులో తనపై ఫెడరల్ అభియోగాలు మోపినట్టు స్వయంగా ట్రంప్ వెల్లడించారు. జూన్ 13న మియామిలోని ఫెడరల్ కోర్టు హౌస్ లో హాజరుకావాలని ఆయనకు సమన్లు ఇచ్చినట్లు తెలిపారు. 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికెన్ పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థిగా దూసుకెళుతున్న తరుణంలో క్రిమినల్ కేసులు ట్రంప్‌ను వెంటాడుతుండటం సర్వత్రా చర్చలకు దారితీసింది.
అయితే, 2021లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్ ప్రభుత్వానికి చెందిన వందలాది కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో ఎస్టేట్ కు తరలించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గత ఆగస్టులో ఆ దేశానికి చెందిన న్యాయశాఖ, మాజీ అధ్యక్షుడి ఇంట్లో సోదాలు చేసి దాదాపు 11 వేల డాక్యుమెంట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సీజ్ చేసిన పత్రాల్లో దాదాపు వంద వరకు క్లాసిఫైడ్ కాగా, మరికొన్ని టాప్ సీక్రెట్ పత్రాలు ఉన్నాయి. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను ఇంట్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. ఆ డాక్యుమెంట్లలో ఎటువంటి సమాచారం ఉన్నా.. భద్రత లేని ప్రదేశాల్లో ఆ డాక్యుమెంట్లు ఉండరాదు.
జాక్ స్మిత్ నేతృత్వంలోని బృందం ఈ కేసును విచారించింది. మొత్తం ఏడు అభియోగాలను ట్రంప్‌పై నమోదు చేశారు. న్యాయాన్ని అడ్డుకోవడం, కుట్ర, అక్రమరీతిలో క్లాసిఫైడ్ సమాచారాన్ని దగ్గర పెట్టుకోవడం లాంటి నేరాభియోగాలు ట్రంప్‌పై నమోదు అయ్యాయి. మంగళవారం రోజున మియామి కోర్టులో ట్రంప్ హాజరుకావాల్సి ఉంది. అయితే ఆ కేసులో ట్రంప్ హాజరుకానున్నట్లు ఆయన తరపున న్యాయవాది వెల్లడించారు. తనపై నేరాభియోగం మోపినట్లు ట్రంప్ తనకు చెందిన ట్రుత్ సోషల్ అనే సోషల్ మీడియాలో ప్రకటించారు. 4 నిమిషాల వీడియోను ట్రంప్ పోస్టు చేశారు. తనను తాను డిఫెండ్ చేసుకున్నారు. ఆయన అమాయకుడినని, కుట్రపూరితంగానే అభియోగాలు మోపినట్లు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో తనను అడ్డుకునేందుకు డెమోక్రాట్లు చేస్తున్న కుట్రగా ఆరోపించారు.
Read more: