Bangladesh: హిందువులే లక్ష్యంగా దాడులు.. 49 మంది టీచర్స్ రాజీనామా

బంగ్లాదేశ్‌లో ఆందోళనల కారణంగా షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి అక్కడ హిందువులు, ఇతర మైనార్టీ ప్రజలపై దాడులు పెరిగాయి.

Update: 2024-09-01 13:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో ఆందోళనల కారణంగా షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి అక్కడ హిందువులు, ఇతర మైనార్టీ ప్రజలపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామా చేసిన ఆగస్టు 5 నుంచి ఇప్పటి వరకు దాదాపు 49 మంది హిందు ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారని అక్కడి ఒక మైనార్టీ సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా మైనార్టీ ఉపాధ్యాయులు భౌతిక దాడులను ఎదుర్కొన్నారని, విద్యార్థుల హింసను బరించలేక వారంతా కూడా ఉద్యోగాలను విడిచిపెట్టాల్సి వచ్చిందని బంగ్లాదేశ్ ఛత్ర ఐక్య పరిషత్‌ను సంస్థ తెలిపింది. అయితే వారిలో 19 మందిని తిరిగి నియమించినట్లు సమాచారం.

ఉద్యోగ రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు చేపట్టిన నిరసనలు కాస్త తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. దీంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నిరసనల్లో కొంతమంది హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులతో సహా మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడులు చేస్తున్నారు. మైనార్టీ వర్గాలపై దోపిడీలు, మహిళలపై దాడులు, దేవాలయాల ధ్వంసం, గృహాలు, వ్యాపారులపై కాల్పులు వంటివి చోటుచేసుకున్నాయి.

ఆగస్టు 18న అజీంపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల, కళాశాలలోని ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని దాదాపు 50 మంది విద్యార్థులు ముట్టడించి ఆమెతో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఒక్క ఘటనే కాకుండా దేశంలో చాలా చోట్ల ఇలాంటివి చోటుచేసుకోవడంతో మైనార్టీ వర్గాలకు చెందిన ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం మైనార్టీలకు తగినంత రక్షణ అందించడం లేదని మండిపడ్డారు.


Similar News