Russia: హెలికాప్టర్ కూలిన ఘటనలో 17 మృతదేహాలు గుర్తింపు

రష్యాలో 22 మందితో కూడిన ఎంఐ-8 సైనిక హెలికాప్టర్ కమ్‌చత్కా ద్వీపకల్పం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే గల్లంతైన విషయం తెలిసిందే,

Update: 2024-09-01 14:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాలో 22 మందితో కూడిన ఎంఐ-8 సైనిక హెలికాప్టర్ కమ్‌చత్కా ద్వీపకల్పం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే గల్లంతైన విషయం తెలిసిందే, అయితే తాజాగా దాని జాడను కనిపెట్టారు. ఆదివారం ఉదయం 900 మీటర్ల ఎత్తులో కొండ ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. దానిలో ఉన్న 22 మందిలో 17 మృతదేహాలను సిబ్బంది గుర్తించినట్లు కమ్‌చత్కా గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు. ఆ ఫుటేజీలో హెలికాప్టర్ శిథిలాలు కొండపైన పెద్ద చెట్లతో కూడిన ప్రాంతంలో పడిపోయినట్లుగా ఉన్నాయి. చివరగా రాడార్‌కు సిగ్నల్ వచ్చిన ఏరియాకు సమీపంలోనే రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ శకలాలను కనిపెట్టారు.

ప్రస్తుతం ఘటనా స్థలంలో తొమ్మిది మంది రెస్క్యూ సిబ్బంది పని చేస్తున్నట్లు రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ పర్వతాన్ని ఢీకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని ఉన్నాతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

శనివారం తెల్లవారుజామున కమ్‌చత్కా ద్వీపకల్పంలోని వచ్కజెట్స్‌ అగ్నిపర్వతం సమీపం నుంచి 19 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో బయలుదేరిన ఈ హెలికాప్టర్ గమ్యస్థానానికి చేరలేదు. పైలట్ల నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌కు ఎలాంటి సందేశం రాకపోవడంతో, అది ఎక్కడైనా కూలిపోయి ఉంటుందని అంచనా వేయగా, ఇప్పుడు అదే నిజమైంది. గతంలో 2021 ఆగస్టులో పొగమంచు కారణంగా దారి సరిగ్గా కనిపించక ఒక హెలికాప్టర్ అక్కడి ఓ సరస్సులో కూలింది. ఆ ఘటనలో హెలికాప్టర్‌లోని 13 మంది చనిపోయారు


Similar News