విశ్వనగరంలో వెలుగులేని వీధులు

దిశ, తెలంగాణ బ్యూరో: విశ్వనగరం చీకట్లో మగ్గిపోతున్నది. గ్రేటర్​సిటీలో రంగురంగుల కేబుల్ బ్రిడ్జిలే కాదు.. వెలుగులు లేని వీధులూ ఉన్నాయి. గల్లీలు, వీధుల్లోనే కాదు ప్రధాన రహదారులపైనా పూర్తిస్థాయిలో లైట్లు లేక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గతేడాది గ్రేటర్ వ్యాప్తంగా 14 వేల చోట్ల లైటింగ్ లేదని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. మరో వైపు రోడ్లపై లైట్లు లేవంటూ సిటిజన్స్ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి గణంకాల్లో తప్ప వాస్తవంలో కనిపించడం లేదు. […]

Update: 2021-01-08 20:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విశ్వనగరం చీకట్లో మగ్గిపోతున్నది. గ్రేటర్​సిటీలో రంగురంగుల కేబుల్ బ్రిడ్జిలే కాదు.. వెలుగులు లేని వీధులూ ఉన్నాయి. గల్లీలు, వీధుల్లోనే కాదు ప్రధాన రహదారులపైనా పూర్తిస్థాయిలో లైట్లు లేక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గతేడాది గ్రేటర్ వ్యాప్తంగా 14 వేల చోట్ల లైటింగ్ లేదని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. మరో వైపు రోడ్లపై లైట్లు లేవంటూ సిటిజన్స్ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.

ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి గణంకాల్లో తప్ప వాస్తవంలో కనిపించడం లేదు. ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ఇప్పటికీ వీధి దీపాలు లేకుండా చీకట్లతో వెళ్లదీస్తున్న కాలనీలు ఉన్నాయి. ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్పడం మినహా ప్రజల ఇబ్బందులను తప్పించడం లేదు. వీధి లైట్లు సరిగా లేకపోవడంతో ఏ రాత్రి ఏ గుంతలో పడాల్సి వస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు వెళ్లాలంటే ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయో తెలియదు.

చీకట్లో చైన్ స్నాచింగ్‌లు, ఆకతాయిల వేధింపులు సరేసరి. వీధుల్లోనే కాదు.. ప్రధాన రహదారులపైనా ఇదే పరిస్థితి. కోర్ సిటీలోనూ లైటింగ్ సరిగా లేని కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4,54,798 వీధి లైట్లు ఉన్నాయి. విద్యుత్ శాఖ వివరాల ప్రకారం 150 వార్డుల్లో 630 చదరపు కిలో మీటర్ల పరిధిలో విద్యుత్ సరఫరా అవుతున్న ఏరియా ఉంది. వీధి దీపాల అవసరం ఉన్న ప్రాంతాలను ‘బ్లాక్ స్పాట్’గా అధికారులు గుర్తిస్తారు. నగరంలో 14 వేలకు పైగా బ్లాక్ స్పాట్లను గుర్తించిన బల్దియా అధికారులు మార్చి చివరి నాటికి అంతటా విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెబుతున్నారు.

గ్రేటర్‌లో 14,382 బ్లాక్ స్పాట్స్

విద్యుత్ సౌకర్యం సరిగా లేని ఏరియాలంటే నగర శివార్లలో ఉంటాయనుకుంటే పొరపాటే. ప్రధాన నగరంలోనూ, ఎక్కువగా విద్యాధికులు, ధనవంతులు ఉండే ప్రాంతాల్లోనూ చీకట్లు అలుముకుంటున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో అన్నింటిలో విద్యుత్ లైట్లు అవసరం ఉన్న ఏరియాలను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ఖైరతాబాద్, బంజారాహిల్స్, ముషీరాబాద్, రాజేంద్ర నగర్, చార్మినార్, ఎల్బీనగర్ సహా సిటీలోని అన్ని ప్రధాన ఏరియాల్లోనూ స్ట్రీట్ లైట్లు లేవు.

నాగోల్, హిమాయత్ నగర్, కాప్రా, దమ్మాయిగూడ, బొల్లారం, మియాపూర్, సుచిత్ర వంటి ప్రధాన ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరా లేని ప్రాంతాలు ఉన్నాయి. 2019 నవంబర్ నుంచి 2020 నవంబర్ వరకూ జీహెచ్ఎంసీ పరిధిలో 14,382 బ్లాక్ స్పాట్స్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో విద్యుద్ధీకరణ పనులను బల్దియా విద్యుత్ అధికారులు ప్రారంభించారు. రెండు నెలల్లో సగం వరకూ పనులు పూర్తి చేశామని, మార్చి 31 నాటికి సిటీలోని బ్లాక్ స్పాట్స్ అన్నింటిలో పనులు పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News