చిన్నమ్మ నిష్క్రమణ దానికి సంకేతమా..? నెచ్చెలి మనసులో ఏముంది..?

దిశ, వెబ్ డెస్క్: తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారింది. కొద్దిరోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికార అన్నాడీఎంకే పార్టీకి శశికళ షాక్ ఇవ్వనున్నారనీ.. లేదు లేదు ఆమె తిరిగి ఆ పార్టీలోనే చేరతారని రాజకీయ విశ్లేషకులు భావించారు. అంతేగాక తన అల్లుడు టీటీవి దినకరన్ పెట్టిన పార్టీ (అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం) ని బలోపేతం చేస్తారని.. ఆ పార్టీ నుంచే ఆమె పోటీ కూడా చేస్తారని మరికొన్ని విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ అనూహ్యంగా వీటన్నింటికీ చెక్ […]

Update: 2021-03-03 23:35 GMT

దిశ, వెబ్ డెస్క్: తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారింది. కొద్దిరోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికార అన్నాడీఎంకే పార్టీకి శశికళ షాక్ ఇవ్వనున్నారనీ.. లేదు లేదు ఆమె తిరిగి ఆ పార్టీలోనే చేరతారని రాజకీయ విశ్లేషకులు భావించారు. అంతేగాక తన అల్లుడు టీటీవి దినకరన్ పెట్టిన పార్టీ (అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం) ని బలోపేతం చేస్తారని.. ఆ పార్టీ నుంచే ఆమె పోటీ కూడా చేస్తారని మరికొన్ని విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ అనూహ్యంగా వీటన్నింటికీ చెక్ పెడుతూ.. తాను రాజకీయాలనుంచే వైదొలుగుతున్నట్టు బుధవారం ఆమె సంచలన ప్రకటన చేశారు. తనకు ఈ పరిస్థితి కల్పించిన వారిపై పగ తీర్చుకుంటానని.. తన మిత్రురాలు, దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి మీద ఒట్టేసి మరీ చెప్పిన ఆమె ఇప్పుడు ఉన్నఫళంగా ఎందుకు సైలెంట్ అయ్యారనే చర్చ తమిళనాట ఊపందుకున్నది.

అసంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గతనెలలోనే బెంగళూరులోని జైలు నుంచి విడుదలైన శశికళ తమిళనాడుకు రావడంతోనే హంగామా సృష్టించారు. భారీ వాహనశ్రేణితో తన బలం ఇంకా తగ్గలేదనే ప్రయత్నం చేశారు. అక్రమాస్తుల కేసులో ఇరుక్కుని సుమారు రెండేళ్ల పాటు జైలులో ఉన్న ఆమె రాక అన్నాడీఎంకేకు ఇబ్బందులు తీసుకొస్తుందనీ, చాలా మంది నాయకులు చిన్నమ్మ చెంతకు చేరుతారని ఊహించారు. కానీ ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండానే శశికళ రాజకీయాల నుంచి ఎందుకు సైలెంట్ అయినట్టు..? అనే ప్రశ్న అన్నానగర్ నుంచి హస్తినాపురం దాకా చర్చనీయాంశంగా మారింది.

ప్లాన్ ఇదేనా…?

జయలలిత మరణం తర్వాత ఏఐడీఎంకే లో సీఎం కోసం జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఓవైపు పళిని స్వామి, మరో వైపు పన్నీర్ సెల్వం.. వీటిని సొమ్ము చేసుకుని తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్టానం వేసిన ఎత్తులు.. తమిళ రాజకీయాలను రచ్చకీడ్చాయి. అయితే ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగింది. అవినీతి ఆరోపణలు ప్రభుత్వానికి ఇబ్బందులు తీసుకొచ్చాయి. పలు సర్వేల ప్రకారం ఈసారి తమిళనాడులో అధికార మార్పిడి ఖాయమనే వాదన వినిపిస్తున్నది. ఈ సమయంలో ఏఐడీఎంకేలో చేరడమో లేదా కొత్త పార్టీ నుంచి చక్రం తిప్పడమో కంటే ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంటేనే ప్రయోజనకరమని శశికళ భావిస్తున్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ సర్వేల ఫలితాలు నిజమై తమిళనాడులో రాజకీయాధికారం మారితే.. తిరిగి ఏఐడీఎంకేను హస్తగతం చేసుకోవడం ఆమెను నల్లేరు మీద నడకే అవుతుంది. లేదా ఆ పార్టీలోని నాయకులను గంపగుత్తగా తన పార్టీలోకి చేర్చుకోవడం కూడా సులువవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News