ఎట్టకేలకు మేలుకున్న ఎన్‌పీపీఏ
దిశ, న్యూస్ బ్యూరో కరోనాపైన యావత్తు దేశమంతా యుద్ధం చేస్తోంది. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సమిష్టిగా పోరు సల్పుతున్నాయి. ప్రజలో ‘లాక్‌డౌన్’కు సహకరిస్తున్నారు. పేషెంట్లకు వైద్య సేవలందించడంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది మునిగిపోయారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), మాస్కులు, గ్లవుజులు లేకున్నా పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోటోకాల్ ప్రకారం వీటిని అందించాలని డాక్టర్లు, నర్సులు మొత్తుకుంటున్నారు. పదిహేను రోజులుగా దేశమంతా ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ప్రధానికి సైతం […]
దిశ, న్యూస్ బ్యూరో
కరోనాపైన యావత్తు దేశమంతా యుద్ధం చేస్తోంది. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సమిష్టిగా పోరు సల్పుతున్నాయి. ప్రజలో ‘లాక్‌డౌన్’కు సహకరిస్తున్నారు. పేషెంట్లకు వైద్య సేవలందించడంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది మునిగిపోయారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), మాస్కులు, గ్లవుజులు లేకున్నా పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోటోకాల్ ప్రకారం వీటిని అందించాలని డాక్టర్లు, నర్సులు మొత్తుకుంటున్నారు. పదిహేను రోజులుగా దేశమంతా ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ప్రధానికి సైతం లేఖలు రాశారు. కానీ ఇప్పుడు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ మేలుకుంది. ఏయే రాష్ట్రం దగ్గర ఇలాంటి వైద్య ఉపకరణాలు ఎన్ని స్టాకులో ఉన్నాయి, అవసరాలకు అనుగుణంగా ఇంకా ఎంత కావాలి… లాంటి పది ప్రశ్నలతో బుధవారం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది.
ఆ శాఖ ఛైర్మన్ శుభ్ర సింగ్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఏప్రిల్ 1వ తేదీన లేఖ రాయడం బట్టి చూస్తే ఇంకా ఈ పరికరాలను సమకూర్చుకునే దశలోనే ఉన్నట్లు అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని సమకూర్చుకున్నామని, ఇబ్బందేమీ లేదని ప్రకటించుకుంటున్నా ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు మాత్రం అవి తగినంత సంఖ్యలో లేవని, రిస్కుతోనే పనిచేస్తున్నామన్నారు. ఎన్‌పీపీఏ ఛైర్మన్ అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలు :
1. రాష్ట్రాల్లో పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్, మాస్కులు, గ్లౌజులు, కరోనా టెస్టింగ్ కిట్‌లు, వెంటిలేటర్లు లాంటి వైద్య ఉపకరణాలు తయారుచేయడానికి ఉన్న సామర్థ్యమెంత? ఎన్ని తయారుచేయగలుగుతుంది?
2. ఇప్పటివరకూ వాటిని సమకూర్చుకోడానికి ఇచ్చిన ఆర్డర్లు ఎన్ని?
3. ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర హెల్త్‌కేర్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన ఆర్డర్లు ఎన్ని?
4. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర సిద్ధంగా ఉన్న స్టాకు ఎంత?
5. రిటైల్ దుకాణాల స్థాయిలో ఉన్న స్టాకు ఎంత?
6. వీటిని సమకూర్చుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? పీపీఈలు, మాస్కులు, గ్లౌజులు, వెంటిలేటర్లు లాంటివి రానున్న రెండు నెలల కాలానికి ఎన్ని అవసరమవుతాయి?
7. ప్రస్తుతం ఇవి ఎంత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి?
8. ఇంకా ఎంత కొరత ఉంది?
9. కొరతను అధిగమించడానికి చేసిన ప్రయత్నాలు, ప్రతిపాదనలు ఏంటి?
10. ఇవి కాకుండా ఇంకా ఎలాంటి అసౌకర్యాలు, కొరతను ఎదుర్కొటున్నాయో ఈ నెల 5వ తేదీకల్లా పంపించాలి.
Tags: NPPA, Corona, Ventilator, Masks, States, Availability, Stock, Requirement