కీలకమైన ఆ చైర్మన్ పీఠం ఎవరికీ.. ?
దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణ ఉద్యోగ జేఏసీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొనసాగుతున్న ఏకైక సంఘం ఇదే. ఉద్యమ సమయంలో పలు జేఏసీలు ఏర్పాటైనా కోదండరాం నేతృత్వంలోని పొలిటికల్ జేఏసీ, ఉద్యోగుల జేఏసీ మాత్రమే ప్రధాన పాత్ర పోషించాయి. రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాజకీయ జేఏసీ నిర్వీర్యమైంది. తలా ఓ దిక్కుగా చీలిపోయారు. కానీ ఉనికిలో ఉన్నది మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ మాత్రమే. టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, టీజీవో […]
దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణ ఉద్యోగ జేఏసీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొనసాగుతున్న ఏకైక సంఘం ఇదే. ఉద్యమ సమయంలో పలు జేఏసీలు ఏర్పాటైనా కోదండరాం నేతృత్వంలోని పొలిటికల్ జేఏసీ, ఉద్యోగుల జేఏసీ మాత్రమే ప్రధాన పాత్ర పోషించాయి. రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాజకీయ జేఏసీ నిర్వీర్యమైంది. తలా ఓ దిక్కుగా చీలిపోయారు. కానీ ఉనికిలో ఉన్నది మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ మాత్రమే. టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో ఉద్యోగ జేఏసీ పలు అంశాల్లో తెరపై ఉంది. కాగా ప్రస్తుతం ఉద్యోగ జేఏసీ చైర్మన్, టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి నేడు(ఆగస్టు 31న) పదవీ విరమణ పొందుతున్నారు. డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ఆయన రిటైరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సీట్లపై ఎవరు కూర్చుంటారనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు జేఏసీ చైర్మన్, అటు టీఎన్జీవో అధ్యక్ష స్థానాలు ముళ్ల కిరీటంగానే భావిస్తున్నారు. పలు అంశాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా తీరకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నెలలో పదవీ విరమణ పెంపుపై నిర్ణయం తీసుకుంటారని ఆశించారు. ప్రభుత్వం నుంచి కూడా ఆశాజనకంగా సమాచారమిచ్చినప్పటికీ.. చివరి వరకు ఉత్కంఠ కొనసాగి తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇన్నిరోజులు జేఏసీ చైర్మన్‌గా వ్యవహరించి, ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించి, ఉద్యోగుల్లో నిరసన రాకుండా ఎంతో కొంత ప్రయత్నాలు చేసిన రవీందర్ రెడ్డి కుర్చీ దిగక తప్పడం లేదు. ఒకవేళ అందరిలాగే ఆయనకు సర్వీసు పొడిగింపు ఇచ్చినా టీఎన్జీవో అధ్యక్షుడిగా కొనసాగేందుకు వీలు లేదు. దీంతో జేఏసీ చైర్మన్ మార్పు అనివార్యంగానే మారింది.
ఈసారి మాకు
ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఎవరి చేతుల్లో ఉండాలనేది చర్చనీయాంశంగా మారింది. జేఏసీ పీఠంపై ముందు నుంచీ రెండు సంఘాలే ఆధిపత్యం వహిస్తున్నాయి. ఉద్యమ సమయలో టీఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న స్వామిగౌడ్ చైర్మన్‌గా, టీజీవో వ్యవస్థాపకుడు, ప్రస్తుత మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సెక్రెటరీ జనరల్‌గా వ్యవహరించారు. వీరితో పాటుగా దేవీప్రసాద్, టీజీవో నుంచి ఏలూరి శ్రీనివాస్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నుంచి శివశంకర్ జేఏసీ కో చైర్మన్లుగా ఉన్నారు. ఆ తర్వాత దేవీ ప్రసాద్ జేఏసీ చైర్మన్‌గా, శ్రీనివాస్ గౌడ్ సెక్రెటరీ జనరల్‌గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జేఏసీ చైర్మన్‌గా కారం రవీందర్ రెడ్డి, సెక్రెటరీ జనరల్‌గా టీజీవో అధ్యక్షురాలు మమత కొనసాగుతున్నారు. శ్రీనివాస్‌గౌడ్ పాలమూరు నుంచి ఎమ్మెల్యేగా ఉండటంతో మమత కొనసాగుతున్నారు. వీరితో పాటుగా సెక్రెటరీలుగా టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ ఉన్నారు.
దేవీప్రసాద్‌కు జేఏసీ చైర్మన్‌గా ఇచ్చే సమయంలోనే టీజీవోకు చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే 122 సంఘాల ఉద్యోగుల జేఏసీలో టీఎన్జీవోది ప్రథమస్థానం కాగా, ఆ తర్వాత టీజీవో ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన టీఎన్జీఓకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ఈసారి టీజీవో నుంచి జేఏసీపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈసారి గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి జేఏసీ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని పలువురు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉద్యోగ జేఏసీ అంటే కొంత పట్టు ఉన్నది కావడంతో ఉద్యోగులను తమ గుప్పిట పెట్టుకునేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవీందర్ రెడ్డి సోమవారం పదవీ విరమణ చెందుతుండటంతో జేఏసీ చైర్మన్ పీఠంపై చర్చ జోరందుకుంది. అయితే వాస్తవంగా టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల పదవీ విరమణ పెంపు హామీని ఇచ్చారు. పలుమార్లు దీనిపై ప్రభుత్వం నివేదికలు కూడా సిద్ధం చేసింది. అయితే ఆగస్టులో కచ్చితంగా ప్రకటన చేస్తారని భావించారు. ఈ నెల 28 వరకు ఆశల్లోనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఆశాజనకంగానే సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ చివరకు ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టినట్లు చెబుతున్నారు.
టీఎన్జీవో కూడా..
రవీందర్‌రెడ్డి రిటైర్మెంట్‌తో టీఎన్జీవో అధ్యక్ష స్థానం కూడా ఖాళీ అవుతోంది. అధ్యక్ష స్థానానికి గతంలో నామమాత్రంగా ఎన్నికలు జరిగినా ఏకగ్రీవ నిర్ణయమే కొనసాగుతోంది. గత మే నెలలో రవీందర్ రెడ్డి మూడోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవమయ్యారు. ఆగస్టు 31న ఆయన రిటైర్ అవుతుండటంతో తర్వాత ఎవరు ఉంటారనే ఊహాగానాలున్నాయి. టీఎన్జీవోలో ఇప్పటి వరకు పరిణామాల ప్రకారం ప్రధాన కార్యదర్శిగా ఉన్న వారికే అధ్యక్ష బాధ్యతలు వస్తున్నాయి. దీని ప్రకారం మామిళ్ల రాజేందర్ అధ్యక్షుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే పలువురు దీనిపై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ అధ్యక్షుడు జగదీశ్, హైదరాబాద్ జిల్లా, సిటీ అధ్యక్షులు ముజీబ్, రాయకంటి ప్రతాప్ కూడా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రధాన కార్యదర్శి పోస్టు కోసం టీఎన్జీవో కోశాధికారి రామినేని శ్రీనివాస్ రావు, సహాధ్యక్షురాలు బండారు రేచల్ కూడా ఆశిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
ముళ్ల కిరీటమే..
ప్రస్తుత పరిస్థితుల్లో అటు ఉద్యోగ జేఏసీ, ఇటు టీఎన్జీవో అధ్యక్షస్థానాలు ముళ్ల కిరీటంగానే భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉద్యోగ వర్గాల్లో తీవ్రమైంది. మూడు డీఏలు పెండింగ్ ఉండటం, ఐఆర్, పీఆర్సీ ఊసే లేకపోవడం, పదవీ విరమణ పెంపుపై సాగదీత ధోరణితో ఉండటం ఉద్యోగుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. మరోవైపు జేఏసీ పక్షాన కూడా ఇటీవల ప్రభుత్వానికి అండగా ఉంటున్నట్లు వ్యవహరిస్తున్నారే తప్ప ఉద్యోగుల సమస్యలపై స్పందించడం లేదని మండిపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె, రెవెన్యూ ఉద్యోగులపై దాడులు, రెవెన్యూ శాఖపై ప్రభుత్వమే వ్యతిరేకంగా ఉండటం వంటి అంశాల్లో జేఏసీ ఏం చేయలేక సన్నగిలపడింది. ఈ నేపథ్యంలో జేఏసీ తరపున ఇక నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిందేనని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికే మమత భర్తకు సర్వీసు పొడిగింపు, పదోన్నతుల అంశంలో జేఏసీపై తీవ్రస్థాయిలో మండిపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ పీఠంపై ఎవరు కూర్చున్నా ప్రభుత్వానికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోక తప్పదని ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో జేఏసీ పగ్గాలు ఎవరు తీసుకుంటారనేది కూడా ప్రశ్నార్థకంగానే మారింది.