బీజేపీ ఎఫెక్ట్.. నోముల కుటుంబం పరిస్థితి ఏంటీ?

దిశ ప్రతినిధి, నల్లగొండ: అధికార టీఆర్ఎస్ పార్టీలో నాగార్జునసాగర్ ఉపఎన్నికపై జరుగుతున్న చర్చ ఏంటి? నిన్నమొన్నటి దాకా నోముల కుటుంబానికి అండగా ఉంటామన్న నేతలు సైతం మాటమార్చారా..? నోముల కుటుంబానికి టికెట్ రాకుండా ఉండేందుకే ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో పావులు కదుపుతున్నారా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక్కసారిగా లోకల్.. నాన్‌లోకల్ వ్యవహారం తెరపైకి రావడం నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. […]

Update: 2021-01-07 23:17 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: అధికార టీఆర్ఎస్ పార్టీలో నాగార్జునసాగర్ ఉపఎన్నికపై జరుగుతున్న చర్చ ఏంటి? నిన్నమొన్నటి దాకా నోముల కుటుంబానికి అండగా ఉంటామన్న నేతలు సైతం మాటమార్చారా..? నోముల కుటుంబానికి టికెట్ రాకుండా ఉండేందుకే ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో పావులు కదుపుతున్నారా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక్కసారిగా లోకల్.. నాన్‌లోకల్ వ్యవహారం తెరపైకి రావడం నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

టీఆర్ఎస్ అభ్యర్థిపై కొరవడిన స్పష్టత..

నాగార్జునసాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ రాకముందే స్థానిక రాజకీయం హీటెక్కుతోంది. అధికార పార్టీ నుంచి అభ్యర్థి ఎవరో తెలకపోయినా.. కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి జానారెడ్డి బరిలో ఉంటారనే సంకేతాలు రావడంతో పోరు ఆసక్తిగా మారనుంది. క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేకపోయినా రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యలో బీజేపీ ఇచ్చే ఫైట్ ఎలా ఉండనుందనేది ఆసక్తిగా మారింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మరో ఛాన్స్ తీసుకోవద్దని భావిస్తున్న టీఆర్ఎస్.. నాగార్జునసాగర్‌లో అభ్యర్థిగా ఎవరిని పెట్టాలన్న దానిపై తీవ్ర తర్జనభర్జన పడుతోంది.

ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఉప ఎన్నికలో నోముల కుటుంబానికి టికెట్ ఇస్తారా.. లేదా అన్నది ఇంకా కొలిక్కి రాలేదు. అలాగే నిన్నమొన్నటి అండగా ఉంటామని చెప్పిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మరోరకంగా మాట్లాడుతున్నారు. పార్టీలోని ఓ వర్గం నేతలు స్థానికులకే ఉపఎన్నిక టికెట్ ఇవ్వాలని బలంగా చెబుతున్నారు. ఈ సందర్భంగా స్థానికత అంశాన్ని తెరపైకి బలంగా తీసుకొస్తున్నారు. నోముల నర్సింహాయ్య బతికి ఉన్న సమయంలో ఆయన పెత్తనాన్ని జీర్ణించుకోలేని టీఆర్ఎస్‌లోని కొంతమంది నేతలు స్థానికత వాదాన్ని ప్రచారంలోకి తీసుకొస్తున్నారని సమాచారం. అలాంటి నాయకులంతా క్షేత్రస్థాయిలో యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది.

2014 ఎన్నికలోనూ అదే పరిస్థితి..

నకిరేకల్‌ నియోజకవర్గానికి చెందిన నోముల నర్సింహాయ్య 2014 ఎన్నికల్లో తొలిసారి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసిన సమయంలోనూ నాన్‌లోకల్ నేతకు టికెట్ ఇవ్వొద్దని ప్రచారం చేశారు. వర్గపోరు కారణంగానే ఆ ఎన్నికల్లో నోముల నర్సింహాయ్య ఓడిపోయారు. 2018 ఎన్నికల్లోనూ అసమ్మతి నేతలు అదే నాన్‌లోకల్ రాగాన్ని అందుకున్నా.. వారి పప్పులు ఉడకలేదనే చెప్పాలి. మాజీమంత్రి జానారెడ్డిని ఓడించి ఎమ్మెల్యే కావడంతో నోముల వ్యతిరేక వర్గం ఆయన్ను పల్లెత్తు మాట అనలేకపోయారు.

కానీ నోముల నర్సింహాయ్య అకాల మరణంతో ఏర్పడిన ఉపఎన్నికలో స్థానికనేతలకే టికెట్ ఇవ్వాలని ఓ వర్గం కోరుతుండడంతో రాజకీయం రంజుగా మారింది. టీఆర్ఎస్ పెద్దలు సైతం బలమైన అభ్యర్థి వేటలో ఉన్నారని తెలుసుకున్న కొందరు నాయకులు తమ బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు. దుబ్బాక ఉపఎన్నిక సమయంలోనూ సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇవ్వొదంటూ స్థానిక టీఆర్ఎస్ నేతలు తీర్మానం చేసి పంపారు. లోకల్ లీడర్స్‌ను బుజ్జగించి.. రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇచ్చినా.. అక్కడ ఎన్నికల ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు నాగార్జున సాగర్‌లోనూ స్థానికంగా అలాంటి వాతవరణాన్నే కల్పించేందుకు కొంతమంది నేతలు లోకల్.. నాన్‌లోకల్ ప్రచారాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.

Tags:    

Similar News