సాగర్ బరిలో నిలిచేది తండ్రా.. కొడుకా..?
దిశ ప్రతినిధి, నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో నల్లగొండ జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. నోటిఫికేషన్ వెలువడకముందే దాదాపు అన్ని పార్టీలు ప్రచారజోరును పెంచాయి. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల సంగతి పక్కనబెడితే కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేకుండాపోయింది. సాగర్ ఉపఎన్నికలో సీనియర్ నేత కుందూరు జానారెడ్డి పోటీ చేస్తారని వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. జానారెడ్డి మాత్రం రోజుకోరకంగా మాట్లాడుతుండడం చర్చనీయాంశంగా మారింది. తన కొడుకు రఘువీర్‌రెడ్డి పోటీలో ఉండేలా జానారెడ్డి […]
దిశ ప్రతినిధి, నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో నల్లగొండ జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. నోటిఫికేషన్ వెలువడకముందే దాదాపు అన్ని పార్టీలు ప్రచారజోరును పెంచాయి. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల సంగతి పక్కనబెడితే కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేకుండాపోయింది. సాగర్ ఉపఎన్నికలో సీనియర్ నేత కుందూరు జానారెడ్డి పోటీ చేస్తారని వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. జానారెడ్డి మాత్రం రోజుకోరకంగా మాట్లాడుతుండడం చర్చనీయాంశంగా మారింది. తన కొడుకు రఘువీర్‌రెడ్డి పోటీలో ఉండేలా జానారెడ్డి పావులు కదపడం కాంగ్రెస్ నేతలను విస్మయానికి గురిచేస్తోంది. ఇంతకీ సాగర్ ఉపఎన్నికలో జానారెడ్డి పోటీ చేస్తారా? లేక ఆయన కొడుకా? అనేది సస్పెన్స్ గా మారింది.
కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే..
కుందూరు జానారెడ్డి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, 15 ఏండ్లకు పైగా మంత్రిగా పనిచేయడమే కాక, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలలో ఒకరిగా ఉన్నారు. సాగర్ ఉపఎన్నికలో తన కొడుకును పోటీ చేయించాలనే తలంపుతో ముందుకు సాగుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలోనే తను నాగార్జునసాగర్ నుంచి రంగంలోకి దిగి, కొడుకును మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావించారు. కానీ, విఫలమయ్యారు. దీంతో రఘువీర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు సరైన వేదిక దక్కలేదు. తాజాగా సాగర్ ఉపఎన్నిక రూపంలో వచ్చిన ఆ అవకాశాన్ని ఎట్టిపరిస్థితులలో వదులుకోకూడదనే ఉద్దేశంతో ఉండటం గమనార్హం. జానారెడ్డి పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించినా ఆయన మాత్రం రఘువీర్ రెడ్డిని పోటీకి దించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు.
కాంగ్రెస్‌కు ఉపఎన్నిక ప్రతిష్టాత్మకం..
సాగర్ పోటీలో ఎవరు ఉంటారనేది పక్కనబెడితే.. ఈ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే.. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా మూడో స్థానానికి పరిమితమయ్యింది. ఈ క్రమంలో ఆ పార్టీ పని అయిపోయిదంటూ.. భవిష్యత్తే లేదంటూ విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. దీంతో సాగర్ ఉపఎన్నికలో గెలిచి పార్టీని ప్రజల్లో నిలపాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. సాగర్ ఉపఎన్నికలో జానారెడ్డి గెలిస్తే.. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందనే టాక్ విన్పిస్తోంది. జానారెడ్డికి నియోజకవర్గంలో ఉన్న పట్టును క్యాష్ చేసుకుని పార్టీని బతికించుకోవాలని చూస్తోంది. కానీ జానారెడ్డి మాత్రం ఉపఎన్నికలో తాను పోటీ చేయడం కంటే.. తన కొడుకు రఘువీర్ రెడ్డిని పోటీలోకి దించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ శ్రేణులు మాత్రం రఘువీర్ రెడ్డి పోటీ చేయడంపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
కావాలనే పేరు తెరపైకి..
ఉపఎన్నికలో రఘువీర్ రెడ్డి పోటీ చేయాలన్న డిమాండ్ ఎక్కడా విన్పించడం లేదు. జానారెడ్డి తన వ్యుహా చతురతతో కావాలనే కొడుకు పేరును తెరపైకి తీసుకొస్తున్నారు. అందుకోసం వీలుచిక్కినప్పుడల్లా.. సాగర్ ఉపఎన్నికలో పోటీ చేసే విషయంపై కామెంట్స్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే నియోజకవర్గంలో పర్యటిస్తూ రఘువీర్ రెడ్డిని క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఏలాంటి రెస్పాన్స్ వస్తుందనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఉపఎన్నికలో పోటీకి జానారెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించారు. అయినా ఆయనే తన కొడుకు పేరును పదేపదే జపించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.