కేసీఆర్, రేవంత్ మంతనాలు.. పెద్దిరెడ్డి దారెటు..?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి సోమవారం బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నన్ను అక్కున చేర్చుకున్నారు : పెద్దిరెడ్డి హుజురాబాద్ ప్రజలకు నేనెవరో తెలియని రోజుల్లోనే వరుసగా రెండు సార్లు గెలిపించారు. రెండు సార్లు మంత్రినయ్యే అవకాశాన్ని కల్పించారని భవిష్యత్తులో కూడా ఇక్కడి నుంచే ప్రత్యక్ష్య రాజకీయాల్లో కొనసాగాలని ఆకాంక్షించానని […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి సోమవారం బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
నన్ను అక్కున చేర్చుకున్నారు : పెద్దిరెడ్డి
హుజురాబాద్ ప్రజలకు నేనెవరో తెలియని రోజుల్లోనే వరుసగా రెండు సార్లు గెలిపించారు. రెండు సార్లు మంత్రినయ్యే అవకాశాన్ని కల్పించారని భవిష్యత్తులో కూడా ఇక్కడి నుంచే ప్రత్యక్ష్య రాజకీయాల్లో కొనసాగాలని ఆకాంక్షించానని అన్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకున్నా ఫర్లేదని కూడా వ్యాఖ్యానించారు.
కమలనాథులపై కినుక..
హుజురాబాద్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. టీఆర్ఎస్‌లో నెలకొన్న అనూహ్య పరిణామాల ప్రభావం బీజేపీలోనూ చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ పార్టీ వీడిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం, ఆయనే అభ్యర్థిగా అధిష్టానం ప్రకటిచింనంత పని చేసింది. దీంతో, అనూహ్యంగా జరిగిన ఈ పరిణామాలతో కలత చెందిన పెద్దిరెడ్డి నియోజకవర్గ ఇంఛార్జీగా ఉన్న తనతో సంప్రదింపులు జరపకుండానే నాయకత్వం ఈటలను చేర్పించుకోవడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి, ఈటల రాజేందర్‌లు హుజురాబాద్‌లోనే ఉన్నప్పటికీ ఒకరినొకరు మాత్రం కలవ లేదు.
ఇదే సమయంలో పెద్దిరెడ్డి తండ్రి అనారోగ్యంతో మరణించారు. దీంతో, విషాదంలో ఉన్న పెద్దిరెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై ఎవరూ మాట్లాడలేదు. పాదయాత్రలో పాల్గొనేందుకు రావాలని ఈటల ఫోన్ చేసి పెద్దిరెడ్డిని ఆహ్వానించినా తన కుటుంబంలో విషాదం నెలకొన్న ఈ సమయంలో తాను రాలేనని సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. అయితే అనూహ్యంగా పెద్దిరెడ్డి రాజీనామా ప్రకటించడంతో ఇప్పుడు ఆయన పయనమెటో అన్నదే సస్పెన్స్‌గా మారింది.
చేయ్యా.. కారా..?
బీజేపీకి రాజీనామా ప్రకటించిన తరువాత పెద్దిరెడ్డి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. భవిష్యత్తు ప్రణాళిక ఏంటో ప్రకటించినప్పటికీ ఒకప్పుడు ఆయన ప్రాతినిథ్యం వహించిన హుజురాబాద్‌లో బై పోల్స్ జరగనున్న నేపథ్యంలో ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తరఫున కూడా పెద్దిరెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ప్రతిపాదన వచ్చినట్టుగా సమాచారం. రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని కూడా ఆయనను కోరినట్టు తెలుస్తోంది.
ఇదే సమయంలో టీఆర్ఎస్ అధిష్టానం కూడా పెద్దిరెడ్డిని ఆహ్వానించింది. రెండు, మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా పెద్దిరెడ్డి కలిసినట్టుగా తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా టీఆర్ఎస్‌లో చేరాలన్న ప్రతిపాదన టీఆర్ఎస్ అధిష్టానం నుండి వచ్చినట్టు సమాచారం. అయితే, ఇప్పటి వరకు పెద్దిరెడ్డి మాత్రం తానే ఏ పార్టీలో చేరాతారన్న విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఉత్కంఠకు దారి తీస్తోంది.