అక్షరాల లక్ష ఎక్కడా.?

దిశ ప్రతినిధి, మేడ్చల్: ‘అక్షరాల లక్ష’ అన్నారు.. పిట్ట గొడలు, ఇరుకు గదులు బంద్​కావాలె. గెలిపిస్తే డబుల్ బెడ్రూం ఇస్తాం. మీ సొంతింటి కల తీర్చే బాధ్యత మాదన్నారు. ఎన్నికల వేళ ఏ గల్లికి పోయినా అదే ముచ్చట.. డివిజన్​నాయకుడి నుంచి ఎమ్మెల్యే, మంత్రి, సీఎం కేసీఆర్ వరకూ లక్ష..లక్ష..లక్ష అంటూ ఊదరగొట్టారు. అర్హులకే ఇస్తాం.. అందరికీ అందేలా చూస్తాం. అంటూ నమ్మించారు. హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు దాటింది. నేడుకు లక్ష ఇళ్లలో పావు వంతు […]

Update: 2020-10-27 23:40 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్:

‘అక్షరాల లక్ష’ అన్నారు.. పిట్ట గొడలు, ఇరుకు గదులు బంద్​కావాలె. గెలిపిస్తే డబుల్ బెడ్రూం ఇస్తాం. మీ సొంతింటి కల తీర్చే బాధ్యత మాదన్నారు. ఎన్నికల వేళ ఏ గల్లికి పోయినా అదే ముచ్చట.. డివిజన్​నాయకుడి నుంచి ఎమ్మెల్యే, మంత్రి, సీఎం కేసీఆర్ వరకూ లక్ష..లక్ష..లక్ష అంటూ ఊదరగొట్టారు. అర్హులకే ఇస్తాం.. అందరికీ అందేలా చూస్తాం. అంటూ నమ్మించారు. హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు దాటింది. నేడుకు లక్ష ఇళ్లలో పావు వంతు కూడా పూర్తికాలె. అంతేకాదు.. అసలుసిసలైన అర్హులకే ఇస్తమని నేడు పార్టీ కార్యకర్తలకే ఇస్తూ వారికే లబ్ధిచేకూరుస్తున్నారు. నేటికీ మంత్రులు లక్ష ఇళ్లు అనే చెబుతున్నారు. ఆ హామీ ఏనాటికి పూర్తయ్యేనో వేచి చూడాలి మరి..!

తెలంగాణ ప్రభుత్వానికి ‘డబుల్’ సెగ తగులుతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రహసంలా మారింది. ఇళ్ల లక్ష్యం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తామని ఐదేళ్లుగా ఊరించిన ప్రభుత్వ పెద్దలకు ఇటీవల జరిగిన ఘటనలు షాక్ కు గురిచేశాయి. అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల సవాళ్లు, ప్రతీ సవాళ్లకు దారి తీసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ శాసన సభ పక్ష నేత భట్టి విక్రమార్కను తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూసేందుకు వెళ్లినప్పుడు నిర్మాణాల బండారం బయట పడింది. ఈ క్రమంలోనే భట్టి విక్రమార్కకు మంత్రి తలసాని అందజేసిన జాబితా ప్రకారం ఇంకా 70 శాతం ఇళ్లు పూర్తి కాలేదని తెలుస్తోంది. దీనికితోడు తమ ఇండ్లను కూల్చేసి ఏండ్లు గడుస్తున్నాయి.. కొత్తవి కట్టియ్యారా..? అంటూ లబ్ధిదారులు మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. మరికొన్ని చోట్ల అర్హులను కాదని టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నెల 7న మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేసర్ మండలం చీర్యాల గ్రామంలో నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించే విషయంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. నిజమైన లబ్ధిదారులను కాదని, టీఆర్ఎస్ కు చెందిన వారికే ఇళ్లను కేటాయిస్తున్నారని ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇదే తరహాలో సోమవారం గోషామహల్ నియోజకవర్గంలోని జియాగూడ, గోడేఖీ కబర్, కట్టెల మండిలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు కేటీఆర్, మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గాంధీ భవన్ పక్కనున్న భీమ్ రావ్ వాడలోని తమ గుడిసెలను ఐదేండ్ల కిందట అర్ధరాత్రి కూల్చేశారని, కానీ ఇప్పటి వరకూ ఇళ్లు కట్టివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోయగూడలో అద్దె ఇళ్లలో ఉంటున్నామని, కట్టెల మండిలో తమ జాగాలు తీసుకొని ఇళ్లు ఇవ్వడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తామని ప్రభుత్వం ఢాంబీకాలు పలుకుతున్నా..క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా తయారైందని ఓ అధికారి చెప్పారు.

నత్తనడకన ఇళ్ల నిర్మాణం

గ్రేటర్ హైదరాబాద్ లో రూ.9,714.59 కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణ వ్యయం కింద రూ.9098.58 కోట్లను , మౌలిక వసతుల కోసం రూ.616.01 కోట్లను కేటాయించింది. మొత్తం 111 ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించుకుంది. వీటిలో 40 ప్రాంతాల్లో ఉన్న పాత ఇళ్ల స్థానాల్లోనే 8,898 కొత్త డబుల్ ఇళ్ల నిర్మాణం చేపట్టాలనుకుంది. మరో 71 ఖాళీ స్థలాలలో 91,102 ఇండ్లను నిర్మించాలనుకుంది. అయితే మహా నగరంలో ఇప్పటి వరకు కేవలం 3,428 ఇళ్లను మాత్రమే ప్రభుత్వం నిర్మిస్తోందని, మంత్రి తలసాని అంతవరకే తనకు ఇళ్లను చూపించారని ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క స్పష్టం చేస్తున్నారు. లక్ష డబుల్ బెడ్ ఇళ్లలో ప్రభుత్వం మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోనే అత్యధికంగా 38,419 ఇళ్లను నిర్మిస్తున్నట్లు స్పష్టం చేయగా, వీటిలో కేవలం 7707 ఇళ్లు మాత్రమే ఇప్పటి వరకు పూర్తయినట్లు జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. అంటే మేడ్చల్ జిల్లాలోనే ఇంకా 30,712 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. ఇకపోతే నగరంలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు లేవన్న కారణంతో గ్రేటర్ అవతలి ప్రాంతంలో ఇళ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి తలసాని చెబుతున్నారు. ఈ లెక్కన సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు లో 144.3 ఎకరాల్లో స్టిల్ట్ ప్లస్ పది, స్టిల్ట్ ప్లస్ 11 అంతస్థులుగా 15,660 ఇళ్లను, రాంపల్లి, అహ్మదగూడలో మరో 12 వేల ఇళ్లను నిర్మిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన 35 నుంచి 40 వేల ఇళ్లలోపు ఇండ్లను మాత్రమే నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చెబుతున్నట్లు మరో 60 వేల ఇళ్లను నిర్మించాలంటే ఈ డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఓ ఇంజినీరు పేర్కొన్నారు. దీనికి తోడు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిందని, ఇంకా ఇళ్లు ప్రారంభం కాని చోట టెండర్లు వేసినా కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకురావడం లేదని ఆయన చెప్పారు.

డబుల్ ఇళ్లే ప్రచారస్త్రం..

మహానగరంలో బల్దియా ఎన్నికల హడావిడి మొదలైంది. మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార, ప్రతి పక్ష పార్టీలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లే ప్రధాన ప్రచార అస్త్రంగా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్రేటర్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామని, ఈ డిసెంబర్ చివరి నాటికి 85వేల ఇళ్లను పేదలకు అందజేస్తామని చెబుతోంది. ఇళ్ల కోసం లబ్ధిదారులు ఐదేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దాదాపు 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అయితే నాటి దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేస్తారా..? లేక కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తారా..? అనే సందిగ్ధత వీడడంలేదు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాత్రం మార్గదర్శకాలను రూపొందించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఇటీవల ఆదేశించారు. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పేరిట పేదలను అధికార పార్టీ మోసం చేసిందంటూ.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా ఆందోళనలు చేపట్టాయి.

ఐదేళ్లుగా నాన్చుడే..

పేదలు ఆత్మగౌరవంతో నివాసించాలనే లక్ష్యంతో ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం నత్తను తలపిస్తోంది. 2016లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టగా, 2017 -18 లో ఇళ్ల నిర్మాణ పనులు షురూ అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో లబ్ధిదారుల పాత ఇళ్ల స్థలంలో నిర్మించిన ఇళ్లలో నివాసాలు కొల్పోయిన వారికి పట్టాలు ఇచ్చారు. దీనివల్ల ఇక్కడ కొత్త వారికి ఇళ్లు దొరకడం కష్టమే. అయితే మిగితా ఖాళీ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇళ్లను ఏ ప్రతిపాదికన కేటాయిస్తారోనన్న అయోమయ పరిస్థితి నెలకొంది. నిర్మిస్తున్న ఇళ్లు వేలల్లోనే ఉండడం.. దరఖాస్తులు మాత్రం లక్షల్లో రావడంతో అర్హలు ఎంపిక అధికార యంత్రంగానికి కత్తిమీద సాము కానుంది. పోని దరఖాస్తు దారులందరికీ ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తుందా..? అంటే గత ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఇళ్లనే ఇప్పటికే 40 శాతం పూర్తి చేయని పరిస్థితి. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వ్యవహారం ఎక్కడికి దారి తీస్తోందో.. వెచి చూడాల్సిందే..

Tags:    

Similar News