బార్బీబొమ్మగా పారాలింపిక్ టెన్నిస్ క్రీడాకారిణి
దిశ, ఫీచర్స్ : టోక్యో నగరంలో విశ్వ క్రీడలకు ఏమాత్రం తగ్గకుండా ‘పారాలింపిక్స్’ పోటీలు ఉత్కంఠగా సాగుతున్న విషయం తెలిసిందే. 160కి పైగా దేశాల నుంచి 4వేల పైగా అథ్లెట్లు తమ దేశానికి పతకం తీసుకురావాలనే లక్ష్యంతో బరిలోకి దిగారు. ఆరంభ వేడుకల్లో చిలీ జట్టు బేరర్‌గా నిలిచిన 43ఏళ్ల ఫ్రాన్సిస్కా మర్డోన్స్ తన దేశానికి వీల్‌చైర్ టెన్నిస్‌లో ప్రాతినిధ్యం వహించింది. షాట్‌పుటింగ్, డిస్కస్ త్రో, జావెలిన్ క్రీడల్లోనూ ఆమె తన సత్తా చాటనుంది. అయితే ప్రముఖ […]
దిశ, ఫీచర్స్ : టోక్యో నగరంలో విశ్వ క్రీడలకు ఏమాత్రం తగ్గకుండా ‘పారాలింపిక్స్’ పోటీలు ఉత్కంఠగా సాగుతున్న విషయం తెలిసిందే. 160కి పైగా దేశాల నుంచి 4వేల పైగా అథ్లెట్లు తమ దేశానికి పతకం తీసుకురావాలనే లక్ష్యంతో బరిలోకి దిగారు. ఆరంభ వేడుకల్లో చిలీ జట్టు బేరర్‌గా నిలిచిన 43ఏళ్ల ఫ్రాన్సిస్కా మర్డోన్స్ తన దేశానికి వీల్‌చైర్ టెన్నిస్‌లో ప్రాతినిధ్యం వహించింది. షాట్‌పుటింగ్, డిస్కస్ త్రో, జావెలిన్ క్రీడల్లోనూ ఆమె తన సత్తా చాటనుంది. అయితే ప్రముఖ బార్బీ బొమ్మల తయారీ సంస్థ మాటెల్, తాజాగా ఆమె రూపంతో ఉన్న వీల్ చైర్ బార్బీని రూపొందించడం విశేషం.
మర్డోన్స్‌కు చిన్నప్పటినుంచి ఒలింపిక్ అథ్లెట్ కావాలనే కోరిక ఉండేది. కానీ 1999లో ఆమె పనిచేస్తున్న ప్యూర్టోరికా ద్వీపంలో హరికేన్ సమయంలో కొండచరియలు విరిగిపడటంతో వెన్నెముక దెబ్బతింది. దాంతో ఆమె వీల్ చైర్‌కే పరిమితమైంది. అనేక ఆపరేషన్లు చేసుకున్నా, నాలుగేళ్ల తర్వాత కోలుకుంది. అప్పటినుంచి వీల్‌చైర్ టెన్నిస్ ప్రాక్టీస్ చేసి, ఆస్టిన్‌లోని గ్రే రాక్ టెన్నిస్ క్లబ్‌లో ఆడటం ప్రారంభించింది. తన ప్రతిభతో చిలీ జట్టుకు ఎంపికైన తను పరాపన్ అమెరికన్ గేమ్స్‌లో పాల్గొని ప్రతిభ చూపింది. 2007లో రియో డి జనీరో, 2011 గ్వాడలజారాలో జరిగిన పోటీల్లో కాంస్య పతకాలు సాధించింది.
చిలీకి ప్రాతినిధ్యం వహిస్తూ 2012 లండన్, 2016-రియో డి జనీరో పార్టిసిపేట్ చేసింది. ఉత్తమ పారాలింపిక్ టెన్నిస్ ప్రదర్శనకుగానూ గోల్డెన్ కాండర్‌తో సహా అనేక అవార్డులు గెలుచుకుంది. సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ఆమె స్పోర్ట్స్ ప్రయాణంలో 2017లో నరాలు దెబ్బతినడంతో కుడిచేయి కట్ అయ్యింది. అంతకు ముందునుంచే ఫీల్డ్ అథ్లెటిక్స్ ప్రయత్నిస్తున్న మర్డోన్స్.. జావెలిన్, డిస్కస్ త్రో, షాట్ పుట్ కొనసాగిస్తూ, టెన్నిస్ నుంచి రిటైర్ కావాలనుకుంది. తర్వాత షాట్‌పుట్ విభాగంలో 2019 ప్రపంచ రికార్డు సృష్టించింది మర్డోన్స్. పారా క్రీడల్లో ఆమె కృషిని గుర్తించిన బార్బీ కంపెనీ మాటెల్ మర్డోన్స్ బొమ్మను విడుదల చేసి, ఆమెకు తగిన గుర్తింపునిచ్చింది.
‘వైకల్యం లక్ష్యాలకు అడ్డుగా ఉండకూడదు. బార్బీ బొమ్మ పిల్లల్లో స్ఫూర్తి రగిలిస్తుందని ఆశిస్తున్నాను. మాటెల్ హైలైట్ చేయాలనుకుంటున్నది నా వైకల్యం కాదు, నా క్రీడా విజయాలు. అది అందరూ అర్థం చేసుకోవాలి. క్రీడల కోసం ఎన్నో ఏళ్లుగా నేను చేస్తున్న కృషికి ఇది ఒక గుర్తింపు.
– ఫ్రాన్సిస్కా మర్డోన్స్
ఆదర్శవంతమైన మహిళామణులను గుర్తిస్తూ మాటెల్ ‘షీరోస్’ పేరుతో వీటిని విడుదల చేస్తుండగా, ఇటీవలే కరోనావైరస్ వ్యాక్సిన్ డెవలపర్ సారా గిల్‌బర్ట్ రూపాన్ని బార్బీ వెర్షన్‌గా ఆవిష్కరించింది. ఇది కోవిడ్ -19 తో పోరాడిన మహిళలను చిత్రీకరించే శ్రేణిలో భాగంగా తీసుకొచ్చింది.