గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

దిశ, వెబ్ డెస్క్: ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కడుపులోని బిడ్డ ఎలా ఉన్నాడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవాలని ప్రతి తల్లికీ ఉంటుంది. అంతేకాదు కడుపులో బిడ్డ బరువు పెరగడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే మంచిదని పదే పదే ఆలోచిస్తుంటారు. గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు ఆరోగ్యకరం? బిడ్డ ఎదుగుదలకు ఏయే ఆహార పదర్థాలు తీసుకుంటే మంచిది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. తొలిసారి తల్లి కాబోతున్న.. ఆ స్త్రీ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. […]

Update: 2020-07-17 03:09 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కడుపులోని బిడ్డ ఎలా ఉన్నాడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవాలని ప్రతి తల్లికీ ఉంటుంది. అంతేకాదు కడుపులో బిడ్డ బరువు పెరగడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే మంచిదని పదే పదే ఆలోచిస్తుంటారు. గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు ఆరోగ్యకరం? బిడ్డ ఎదుగుదలకు ఏయే ఆహార పదర్థాలు తీసుకుంటే మంచిది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తొలిసారి తల్లి కాబోతున్న.. ఆ స్త్రీ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. ఓ పక్క పట్టరాని సంతోషమున్నా మరో వైపు ఎన్నో అనుమానాలు ఆమెను కలవరపెడుతుంటాయి. అందులో ప్రధానంగాపుట్టబోయే బిడ్డ ఆరోగ్యం , ఎదుగుదల కోసమే ఆ తల్లి ఎక్కువగా ఆలోచిస్తుంటుంది. మొదట.. ఆ ప్రశ్నలన్నింటిని పక్కనపెట్టి గర్భిణులు ప్రశాంతంగా ఉండాలి. కంగారు పడకూడదు. గర్భధారణ సమయంలో ఒత్తిడి ఎదురు కావడం వల్ల, వారికి పుట్టబోయే పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్, ఊబకాయం వంటి అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. కావున, గర్భధారణ సమయంలో యోగా, ధ్యానం చేయడం ద్వారా ప్రెగ్నెంట్‌ ఉమన్స్‌ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేసుకోవాలి. అందుకోసం క్లాసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో తమకు తాము చేసుకున్న పర్వాలేదు. గర్భధారణ సమయంలో కనీసం 20 నిమిషాల నడక గర్భిణులను మరింత ఫిట్‌గా ఉంచుతుంది. తేలికపాటి వ్యాయామాలను సాధన చేయడం ఉత్తమం. శ్రమతో కూడిన వ్యాయామాలను అసలు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

గర్భం ధరించిన ప్రారంభ దశలో శరీరానికి కావాల్సిన పోషకాహారాల అవసరాలను గుర్తించి జాగ్రత వహించాలి. బాగా ఉడికిన గుడ్లను మాత్రమే తీసుకోవాలి. ప్రెగ్నెంట్‌ ఉమన్స్‌ మాంసాహారం తక్కువగా తినేవారైనా లేదా మాంసాహారం ఇష్టం లేకపోయినా దానికి బదులుగా బీన్స్, కాయ ధాన్యాలను తినడం ఉత్తమం. వీటిలో సమృద్ధిగా ఐరన్, ప్రోటీన్స్, ఫైబర్స్, ఫోలేట్, కాల్షియం ఉండటం వలన గర్భవతుల ఆరోగ్యానికి సహకరించడంతో పాటు, వారి కడుపులో ఉన్న బిడ్డ బరువు పెరిగేందుకు బాగా ఉపయోగపడతాయి. అదే మాంసాహారులైతే గుడ్లు తినడం వల్ల గర్భంలో ఉండే శిశువు మెదడుకి కావలసిన కోలిన్‌ను పొందొచ్చు. తాజా కూరగాయలు, పండ్లు, పండ్లరసాలు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు మొదలైన వాటిలో గర్భిణులకు కావలసిన పోషకాలు లభ్యమవుతాయి.

జీర్ణశక్తికి చిలకడదుంప..

ఫోలిక్‌ యాసిడ్‌ లోపం వల్ల పుట్టబోయే పిల్లల్లో వెన్నెముకకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. దంపుడు బియ్యం, ఆకుకూరలను తీసుకోవడం ద్వారా ఫోలిక్‌ యాసిడ్‌ను ఎక్కువ మోతాదులో పొందొచ్చు. తద్వారా పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.చిలకడదుంపలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. మన శరీరం బీటా కెరోటిన్‌ను గర్భం‌లో పిండం ఎదగడానికి ఉపయోగపడే ‘విటమిన్ A’‌గా మారుస్తుంది. రోజూ 100-150 గ్రాముల చిలకడదుంప తీసుకోవడం వల్ల.. శరీరంలో ‘విటమిన్ A’శాతాన్ని 10 నుంచి 40 శాతం పెంచుతుంది. చిలకడ దుంపలో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. రక్తంలో చక్కర శాతాన్ని తగ్గిస్తుంది.

కూరగాయలు తప్పనిసరి..

రోజువారి ఆహారంలో 5 రకాల పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ధాన్యానికి సంబంధించిన పిండి పదార్థాలను ఎక్కువ తినడం వల్ల, ఫైబర్‌ను పుష్కలంగా పొందొచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా డ్రై ఫ్రూట్స్ తినడం ఎంతో మంచిది. అవి తినడం వల్ల బిడ్డ బరువు పెరుగుదలు బాగుంటుంది. ఎండు ద్రాక్ష, ఖర్జూరం, అంజీరా, పిస్తా, జీడిపప్పు, డ్రై ఆప్రికాట్స్ తినడం వలన వీటిలో ఉండే ఫైబర్స్, ప్రోటీన్స్, ఐరన్, పొటాషియం బిడ్డ ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయి. అలాగే వీటిలో ఉండే పొటాషియం, ఐరన్ ప్రసవ సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. పాలు, పెరుగు, జున్ను వంటివి ఉపయోగపడతాయి. చేపలలో తప్ప, మిగతా ఆహార ఉత్పత్తులయిన ఆకుపచ్చని ఆకుకూరలు, గింజలు, నట్స్, సోయా ఉత్పత్తులలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి మేలు చేస్తాయి. రోజూ ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల వికారం, వాంతుల నుండి బయటపడొచ్చు. కడుపులోని బిడ్డకు కూడా ఎంతో మంచిది.

జంక్ ఫుడొద్దు..

ఫాస్ట్‌ ఫుడ్‌, పీజా, బర్గర్‌ వంటి జంక్‌ఫుడ్‌ జోలికి పోకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే వీటి తయారీలో ఉపయోగించే అజినమోటో అంటే టేస్టింగ్‌ సాల్ట్‌ శిశువు ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ర్పభావం చూపుతుంది. అందువల్ల వీలైనంత వరకు వీటికి దూరంగా ఉంటే బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాచ్యురైజేషన్‌ చేయని పాలతో తయారుచేసిన జున్ను వంటి పదార్థాలు తినకూడదు. పాచ్యురైజేషన్‌ చేయని పాలలో లిస్టీరియా, బొవైన్‌ టి.బి అనే బ్యాక్టీరియా ఉంటుంది. దానివలన గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాయకూరలు బాగా కడిగి తినాలి. కడగని ఆకుకూరలు, కాయలు, పండ్ల పైన టోక్సోప్లాస్మోసిస్‌ కలుగజేసే బాక్టీరియా ఉంటుంది. గర్భస్థ శిశువుకు ఇది చాలా ప్రమాదకరమైంది.

Tags:    

Similar News