సీఎం జగన్‌కు కేసీఆర్ కౌంటర్ ఇస్తారా..!

దిశ, తెలంగాణ బ్యూరో : జల వివాదాల్లో ఇప్పుడు తెలంగాణ సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాష్ట్రంలో హాట్​టాపిక్‌గా మారింది. అటు ఏపీ సీఎం జగన్​ మరోసారి కేంద్రానికి లేఖ రాశారు. కేబినెట్​ భేటీ తర్వాత రాసిన లేఖలో తెలంగాణను దోషిగా చిత్రీకరించారు. కృష్ణా నదిలో తమ వాటాను వినియోగించుకునేందుకే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, తెలంగాణలోనే అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ కేంద్రానికి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తెలంగాణ నుంచి మంత్రులు ఎదురుదాడి మొదలుపెట్టారు. దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన […]

Update: 2021-07-02 15:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : జల వివాదాల్లో ఇప్పుడు తెలంగాణ సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాష్ట్రంలో హాట్​టాపిక్‌గా మారింది. అటు ఏపీ సీఎం జగన్​ మరోసారి కేంద్రానికి లేఖ రాశారు. కేబినెట్​ భేటీ తర్వాత రాసిన లేఖలో తెలంగాణను దోషిగా చిత్రీకరించారు. కృష్ణా నదిలో తమ వాటాను వినియోగించుకునేందుకే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, తెలంగాణలోనే అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ కేంద్రానికి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తెలంగాణ నుంచి మంత్రులు ఎదురుదాడి మొదలుపెట్టారు. దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు ఏపీపై స్వరం పెంచారు. కానీ సీఎం నుంచి మాత్రం దాడి మొదలుకాలేదు. ఏపీ తరహాలో కేంద్రానికి లేఖ రాస్తారని భావించినా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఏం చేద్దాం..?

వాస్తవంగా జల వివాదాలను తెలంగాణ తరుపు నుంచి కేంద్రం చేతిలో పెట్టారు. అపెక్స్​ కౌన్సిల్​లో చెప్పిన విధంగా సుప్రీం కోర్టులో పిటిషన్​ను విత్​ డ్రా చేసుకున్నారు. గత నెల 9న పిటిషన్​ను ఉపసంహరించుకుని కేంద్రానికి లేఖ పంపించారు. అయితే కేంద్రం నుంచి మాత్రం ఇప్పటికీ ఎలాంటి రిప్లై రాలేదు. అనంతరం ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్​తో సీఎం కేసీఆర్​ మాట్లాడారని, ఏపీపై ఫిర్యాదు చేశారని ప్రచారం జరిగింది. కానీ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ సీఎం కేంద్రానికి లేఖ రాసిన వెంటనే తెలంగాణ నుంచి కూడా లేఖ పంపుతారని భావించారు. కానీ సీఎం కేసీఆర్​మాత్రం సైలెంట్​గా ఉన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులను ఏపీపై ఉసిగొల్పుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ కేసీఆర్​మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే చర్చ నీటిపారుదల శాఖలో నడుస్తోంది.

సమాధానం చెప్తారా..!

ఏపీ సీఎం జగన్​ లేఖలో తెలంగాణపై తీవ్రస్థాయిలో ఆరోపణలు సంధించారు. శ్రీశైలం నీటిని విద్యుదుత్పత్తి కోసం అనధికారికంగా తెలంగాణ తోడేస్తోందని, భవిష్యత్‌లో ప్రాజెక్టుల నుంచి దౌర్జన్యంగా తెలంగాణ నీటిని తోడేయకుండా ఉండేందుకు.. తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల భద్రతకు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరించాలని లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలూ కేటాయింపుల మేరకు కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు వీలుగా విభజన చట్టం సెక్షన్‌ 85 ప్రకారం ఏర్పడిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని ఖరారు చేయాలని, జల విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం జలాశయం నుంచి అక్రమంగా తెలంగాణ నీటిని తోడేయడం.. పోలీసులను మోహరించి మరీ జల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తుండడంతో రెండు రాష్ట్రాల మధ్య యుద్ధవాతావరణం ఉందంటూ చెప్పుకొచ్చారు.

శ్రీశైలం జలాశయాన్ని విద్యుతుత్పత్తి కోసమే నిర్మించినా.. తదనంతర పరిస్థితుల నేపథ్యంలో అది సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతూ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారిందంటూ సూచించారు. ప్రధాన జలాశయాల నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ కృష్ణా జలాలను కిందకు వదిలేయడం వల్ల చివరన ఉన్న ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3.7 టీఎంసీ కావడంతో.. నీటిని నిల్వ చేసుకునే వీలు లేక కృష్ణా జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయని, జలవిద్యుదుత్పత్తి ఆపేయాలని కేఆర్‌ఎంబీ ఆదేశించినా తెలంగాణ బేఖాతరు చేస్తోందంటూ కేంద్రానికి లేఖ పంపిన విషయం తెలిసిందే.

అయితే దీనిపై తెలంగాణ తరుపున సమాధానం చెప్పాల్సి ఉందంటున్నారు. ఎందుకంటే గతంలోనూ ఏపీ… తెలంగాణపై నీళ్ల విషయంలో తెలంగాణపై విమర్శలు చేశారు. ఇప్పుడు కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వీటిని కేంద్రానికి వివరించాల్సి బాధ్యత కూడా తెలంగాణ సీఎంపై ఉందంటున్నారు. మరోవైపు ప్రాజెక్టుల దగ్గర కేంద్ర బలగాల భద్రత అనవసరమంటూ తెలంగాణ ఎప్పటి నుంచో వాదిస్తోంది. వీటిపై సీఎం కేసీఆర్​ కేంద్రానికి లేఖ రాస్తారా… లేక కేంద్రం తీసుకునే చర్యల కోసం ఇంకా ఎదురుచూస్తారా అనేది ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.

Tags:    

Similar News