హుస్సేన్‌సాగర్ కాలుష్యంపై మీ వైఖరేంటి?
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతీ ఏటా గణేశ్ నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో చోటుచేసుకుంటున్న కాలుష్యంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతీ ఏటా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే తప్ప శాశ్వతమైన విధానం ఉండదా అని ప్రశ్నించింది. ఈ ఏడాది గణేశ్ నిమజ్జనంపై ఏం నిర్ణయం తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రతీ సంవత్సరం గణేశ్ నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్ కాలుష్యంగా మారిపోతున్నదని, దీని నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది వేణుమాధవ్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతీ ఏటా గణేశ్ నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో చోటుచేసుకుంటున్న కాలుష్యంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతీ ఏటా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే తప్ప శాశ్వతమైన విధానం ఉండదా అని ప్రశ్నించింది. ఈ ఏడాది గణేశ్ నిమజ్జనంపై ఏం నిర్ణయం తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రతీ సంవత్సరం గణేశ్ నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్ కాలుష్యంగా మారిపోతున్నదని, దీని నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి ప్రభుత్వంపై ప్రశ్నలవర్షం కురిపించారు.
హుస్సేన్ సాగర్‌ను కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని, పర్యాటకులకు ఆహ్లాదం కలిగించేలా, వారిని ఆకట్టుకునేలా మార్చాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. పిటిషన్‌పై గురువారం విచారణ సందర్భంగా న్యాయవాది వేణుమాధవ్ వాదిస్తూ, గణేశ్ నిమజ్జనంతో పాటు దుర్గా విగ్రహాల నిమజ్జనం కూడా హుస్సేన్ సాగర్‌లోనే జరుగుతున్నదని, కాలుష్యంగా మారుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో, నగరంలో కరోనా పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, గణేశ్ విగ్రహాలను పెట్టడానికి మండపాలకు అనుమతి ఇవ్వవద్దని, ఆ తర్వాత జరిగే నిమజ్జనాలకు సైతం పర్మిషన్ ఇవ్వకూడదని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
గతంలో హైకోర్టులో దాఖలైన ఒక పిటిషన్‌ను విచారించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌బీ సిన్హా హుస్సేన్ సాగర్ కాలుష్యాన్ని నివారించేందుకు, నీటిని శుద్ధి చేసేందుకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారని, కానీ ప్రభుత్వం దాన్ని ఆచరించలేదని, కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం తుంగలో తొక్కిందని, కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడిందని పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తుచేశారు. ఇప్పటికీ మురుగునీరు హుస్సేన్ సాగర్‌లో కలుస్తూనే ఉన్నదని, ప్రభుత్వం దాన్ని నివారించలేకపోయిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫున హాజరైన ప్రత్యేక న్యాయవాది హరేందర్ సింగ్ వాదిస్తూ, గతేడాది కరోనా కారణంగానే విగ్రహాలు పెట్టే మండపాలకు, నిమజ్జనానికి అనుమతి ఇవ్వలేదని వివరించారు. ఈ సంవత్సరం ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు వివరించారు. ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని, కరోనా ఎప్పుడైనా ఉప్పెనలా విజృంభించే ప్రమాదం ఉన్నదని, వైరస్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తదనుగుణమైన నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు. హుస్సేన్ సాగర్‌ను కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని, అందంగా ఉంచాలని స్పష్టం చేశారు. టూరిస్టులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సంవత్సరం గణేజ్ నిమజ్జనంపై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని సూచించి తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు.