వరద సాయానికి బ్రేక్ వెనక రహస్యమేంటి?
దిశ, తెలంగాణ బ్యూరో: గత నెల నగరంలో కురిసిన భారీ వానలు అధికార పార్టీని కుదిపేస్తున్నాయి. అప్పటి నుంచి గులాబీలకు అంటుకున్న బురద మరక వీడటం లేదు. వరద సాయాన్ని స్థానిక నేతలు అడ్డంగా తినేశారని సొంతంగా చేసుకున్న సర్వేలోనే తేలింది. దీంతో పలువురు కార్పొరేటర్లకు టికెట్లు దూరమయ్యాయి. బాధితుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండటంతో మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. ఎక్కువ నిధులు కావలసి రావడంతో దీన్ని ఆపేయాలని నిర్ణయం […]
దిశ, తెలంగాణ బ్యూరో: గత నెల నగరంలో కురిసిన భారీ వానలు అధికార పార్టీని కుదిపేస్తున్నాయి. అప్పటి నుంచి గులాబీలకు అంటుకున్న బురద మరక వీడటం లేదు. వరద సాయాన్ని స్థానిక నేతలు అడ్డంగా తినేశారని సొంతంగా చేసుకున్న సర్వేలోనే తేలింది. దీంతో పలువురు కార్పొరేటర్లకు టికెట్లు దూరమయ్యాయి. బాధితుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండటంతో మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. ఎక్కువ నిధులు కావలసి రావడంతో దీన్ని ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికార పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.
తాము అధికారికంగా ప్రకటిస్తే వ్యతిరేకత మరింత పెరుగుతుందని భావించిన ప్రభుత్వం ఈ బాధ్యతను రాష్ట్ర ఎన్నికల సంఘం నెత్తి మీదకు నెట్టింది. ఫలితంగా ఎన్నికల సంఘం ఒక్కరోజులోనే మాట మార్చింది. పథకాన్ని కొనసాగించవచ్చని మంగళవారం ప్రకటించిన ఈసీ, ఇది నియమావళికి విరుద్ధమని బుధవారం స్పష్టం చేసింది. దీంతో గ్రేటర్లో బురద రాజకీయం వేడెక్కింది. పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెర లేచింది. బీజేపీ అధ్యక్షుడు రాసినట్టుగా ఉన్న లేఖను గులాబీ వర్గాలు సోషల్ మీడియాలో పోస్టు చేశాయి. ఇది నకిలీ లేఖ అని బీజేపీ చెబుతోంది. కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించింది.
అవకతవకలు
నేరుగా నగదును పంపిణీ చేసిన సమయంలో పార్టీ నేతలు సగం నొక్కారు. అసలు బాధితులకు ఇవ్వకుండా నష్టం కానివారికి సాయమందించారు. రెండు, మూడో ఫ్లోర్లలో నివాసం ఉండేవారికి ఇచ్చారు. సమగ్ర వివరాలు వెలుగులోకి రావడంతో సాయాన్ని ఆపేశారు. ఈ నెల ఒకటినాటికే దాదాపు రూ.412 కోట్ల వరకు పంపిణీ చేశారు. బాధితుల నుంచి ఆరోపణలు, వినతులు రావడంతో మూడు రోజుల నుంచి మళ్లీ మొదలుపెట్టారు. ఈసారి మీ సేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తొలిరోజు దరఖాస్తు చేసుకున్నవారికి రూ.55 కోట్లను విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే వరద సాయానికి మళ్లీ డిమాండ్ పెరిగింది. బాధితులు మీసేవ కేంద్రాలకు బారులు తీరారు. ఓ వృద్ధురాలు మరణించింది. ఒక్కరోజులోనే 2.80 లక్షల దరఖాస్తులు నమోదయ్యాయి. వరదసాయం కొనసాగుతూనే ఉంటుందని, దరఖాస్తులు వస్తూనే ఉంటాయని అధికారులు గుర్తించారు. వేలకు వేలు దరఖాస్తులు వస్తున్న అంశంపై ప్రభుత్వానికి నివేదించారు.
ఆర్థిక భారమే కారణమా?
వరద సాయాన్ని ప్రభుత్వం ఆర్థిక భారంగా పరిగణిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. వాస్తవంగా గ్రేటర్లో వరద సాయం కింద రూ.550 కోట్లు ప్రకటించారు. ఈ టార్గెట్ ఇప్పటికే దాటింది. ఇప్పటి వరకు ఉన్న దరఖాస్తు ప్రకారం ఇంకో రూ.300 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. దరఖాస్తులు ఇంకా వచ్చే అవకాశాలు ఉండటంతో వరద సాయాన్ని ఆపేందుకే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే కొంతమేరకు బద్నాం అయినప్పటికీ, పంపిణీని కొనసాగించడం కష్టమని భావిస్తున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసినవాటితోనే ఓట్లు రాలుతాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చుట్టుకున్నాయి. ప్రభుత్వం ఒత్తిడి తేవడంతోనే దీన్ని ఆపాలని ఎస్ఈసీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని అంటున్నారు. ఇది ప్రభుత్వానికి కూడా వ్యతిరేకతను పెంచుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పార్టీల మధ్య మాటల యుద్దం
ఈ అంశంపై పార్టీల మధ్య మాటల యుద్దం మొదలైంది. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లుగా ముందుగా సోషల్ మీడియాలో అధికార పార్టీ పోస్టింగులు పెట్టింది. అది తప్పుడు లేఖగా పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పేరుతో ఉన్న ఈ లేఖలో చాలా తప్పులున్నాయంటూ ప్రచారం జరిగింది. గులాబీ శ్రేణులు మాత్రం దీన్ని సోషల్మీడియాకు వదిలేశారు. బీజేపీ కూడా స్ట్రాంగ్కౌంటర్ ఇచ్చింది. వరద సాయాన్ని బీజేపీనే ఆపించిందని చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయంలో కేసీఆర్ ప్రమాణం చేయాలని బండి సంజయ్ సవాలు విసిరారు. తాను కూడా ప్రమాణం చేస్తానన్నారు. తాను లేఖ రాయలేదని స్పష్టం చేశారు. తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీనే ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. క్యూలో నిలుచున్న మహిళ మరణించడం ప్రభుత్వ హత్యేనని, కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో దేశ ప్రజలు మర్చిపోలేదని, ఎన్నికల సంఘం ప్రభుత్వానికి తొత్తుగా మారిందని విమర్శించారు.
చిల్లర రాజకీయాలు
కాంగ్రెస్కూడా వరద సాయం పంపిణీ నిలిపివేయడంపై మండిపడింది. ఓట్ల కోసం టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ఉత్సవ విగ్రహంగా మారిపోయారని విమర్శించారు. వరద సహాయం తీసుకురావడంలో బీజేపీ విఫలమైందని వ్యాఖ్యానించారు. పేదలను రోడ్ల మీద నిలబెట్టి ప్రాణాల మీదకు తీసుకొని వచ్చారన్నారు. చదువుకున్న వారే ఎలక్షన్ కమిషన్‌లో ఉన్నారా? లేక సన్నాసులు వున్నారా? అని ఘాటుగా విమర్శించారు. సీఎం కేసీఆర్ నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్ వరద సహాయం అందిచవద్దు అని ఏమైనా కంప్లైంట్ చేసాయా అని ప్రశ్నించారు. నిరూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చేతకాక ఎన్నికల సంఘంతో నిలిపివేయించి ప్రతిపక్ష పార్టీలు మీద బురద చల్లుతున్నారన్నారు. జీహెచ్ఎంసీ వద్ద లిస్ట్ తీసుకొని బాధితులకు నేరుగా బ్యాంకులో వరద సాయం వేయాలని కోరారు.