నాటి ముల్కి ఉద్యమం లో ఏం జరిగింది? తొలి ర్యాలీ ప్రదర్శన ఎక్కడ జరిగింది
ముల్కీ ఉద్యమంలో భాగంగా ఊరేగింపు జరుపుతున్న విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపి నేటికి సరిగా 70 యేళ్లు. అప్పటి కాల్పులలో ఎనిమిది
పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. విద్యార్థి లోకం వెనక్కి తగ్గలేదు. చేసేది లేక నేరుగా కాల్పులు జరిపారు. ఒక విద్యార్థి బుల్లెట్ తగిలి నేలకు ఒరిగాడు. ఆగ్రహించిన విద్యార్థులు బస్సులను తగలబెట్టారు. వేల కొద్దీ ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మేజిస్ట్రేట్ రెండోసారి ఫైరింగ్‌కి ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసులు కాల్పులలో చాలామంది బుల్లెట్లు తగిలి పడిపోయారు. ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా, మరో ఇద్దరు ఉస్మానియా హాస్పిటల్‌లో మరణించారు. సెప్టెంబర్ నాలుగున వారి మృతదేహాలతో ఊరేగింపు చేయాలని విద్యార్థులు నిర్ణయించుకొని ఉస్మానియా హాస్పిటల్‌కి బయలుదేరారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. కాల్పులు జరిపారు. దీంతో మరో నలుగురు మరణించారు. వందల మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు.
ముల్కీ ఉద్యమంలో భాగంగా ఊరేగింపు జరుపుతున్న విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపి నేటికి సరిగా 70 యేళ్లు. అప్పటి కాల్పులలో ఎనిమిది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనే స్వరాజ్య కాంక్షకు పునాదులు వేసింది. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తెలంగాణ ప్రాంత ప్రజలపై పెత్తనం చెలాయించడం, తెలంగాణ విద్యార్థులకు దక్కాల్సిన ఉద్యోగాలను తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి పొందడం లాంటి అరాచకాలెన్నో జరిగాయి. వీటిని వ్యతిరేకించి, నాన్ ముల్కీలుగా ఉన్న ఆంధ్ర ప్రాంతీయులు వారి ప్రాంతానికి వెళ్లిపోవాలని, ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడ ప్రజలకే ఇవ్వాలని కోరుతూ స్థానికులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 'నాన్ ముల్కీ గో బ్యాక్' నినాదంతో ఉద్యమం వరంగల్‌లో ప్రజ్వలించింది.
ఈ సమస్య 1868 నుంచి హైదరాబాద్ రాష్ట్రంలో ఉంది. నిజాం రాజ్యం భారతదేశంలో కలవడానికి ముందు ఇక్కడ ఉత్తర భారత ముస్లింలు ఉన్నత పదవులు, ఉద్యోగాలలో నియమితులయ్యారు. వారిని వెంటనే తొలగించాలని కోరుతూ హైదరాబాద్ ముస్లిం మేధావులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు నిజాంకు వినతి పత్రాలు అందించారు. ప్రజలలో చైతన్యం కలిగించారు. 1948 విలీనం తరువాత పోలీస్ శాఖలో నాన్ ముల్కీల నియామకం అనివార్యమైందని నాటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వెల్లడించారు. కానీ, పోలీస్ శాఖలోనే కాకుండా కార్మిక, రెవెన్యూ, న్యాయ, సమాచార, జైలు, పరిశ్రమలు, మత్స్య, విద్యా, పౌర సరఫరాలు తదితర శాఖలలోనూ నాన్ ముల్కీల నియామకం జరిగింది.
ముల్కీ ఉద్యమానికి బీజాలు
వరంగల్ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డీఐఎస్) పార్థసారథి 1952 జూన్, జూలై నెలలలో 180 మంది ఉపాధ్యాయులను మూకుమ్మడిగా బదిలీ చేశారు. తెలంగాణకు చెందిన ఉపాధ్యాయులను మారుమూల గ్రామాలకు, ఏకోపాధ్యాయ పాఠశాలలకు పంపించి వీరి స్థానాలలో ఆంధ్రకు చెందిన ఉపాధ్యాయుల నియమించారు. ఇది ఉపాధ్యాయులలో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. నాన్ ముల్కీ అయిన పార్థసారథి ఇబ్బందులకు గురి చేయడంతో తెలంగాణ ఉపాధ్యాయులంతా విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షండార్కర్‌కి 1952 జూలై 26న ఫిర్యాదు చేశారు. ఆయన వరంగల్‌లో విచారణ జరిపించారు. న్యాయ విచారణ జరగాలని, నాన్ ముల్కీలను వెంటనే ఉద్యోగాలను తొలగించాలని వరంగల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఊరేగింపు జరిపారు. దీనినే ముల్కీ ఉద్యమంలో తొలి ప్రదర్శన గా చెప్పుకోవచ్చు.
విద్యార్థులు జూలై 27, 28, 29 తేదీలలో తరగతులు బహిష్కరించి ముఖ్యమంత్రికి తీర్మానం పంపాలని నిర్ణయించారు. ఉద్యమం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి సమస్య పరిష్కారానికి ఆగస్టు 26న సబ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. సమ్మె విరమించుకోవాలని విన్నవించారు. కానీ, ఎలాంటి పత్రికా ప్రకటన వెలువడలేదు. హన్మకొండ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకొని పోలీసులు లాఠీచార్జికి దిగారు. దీంతో విద్యార్థి లోకం భగ్గున మండింది. ఆగస్టు 29న భువనగిరి, ఖమ్మం వరంగల్, ఇల్లందు మహబూబ్‌నగర్, హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ విద్యార్థులంతా తరగతులు బహిష్కరించి సమ్మెకు దిగారు.
సెప్టెంబర్ 3న కాల్పులు
సెప్టెంబర్ మూడున ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. తరగతులు బహిష్కరించి విద్యార్థులంతా ర్యాలీలు నిర్వహించారు. వారిని అదుపు చేయడం కోసం పోలీసులు సైఫాబాద్ సైన్స్ కాలేజ్ వద్ద లాఠీఛార్జ్ చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ ఊరేగింపులు, సభలు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని విద్యార్థులు ఖాతరు చేయలేదు. దీంతో పోలీసులు సిటీ కాలేజీ ఆవరణలోని విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు, విద్యార్థులు రాళ్లు రువ్వారు. కమిషనర్ విద్యార్థులకు నచ్చజెప్పి కాలేజీ గేట్ లోపలికి పంపించారు. కొద్దిసేపటి తర్వాత ప్రజలు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి రాళ్లు విసిరారు. పోలీసులు లాఠీచార్జి చేశారు. పక్కనే హైకోర్టులో ఉన్న వకీల్, ఆనాటి శాసనసభ్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వెంటనే రంగంలోకి దిగి విద్యార్థులకు, ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా, ఫలితం లేకపోయింది.
పరిస్థితి చేయి దాటి పోయేలా ఉందని కమిషనర్ మేజిస్ట్రేట్‌కు తెలియజేశారు. ఆయన వెంటనే ఫైరింగ్‌కి ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. విద్యార్థి లోకం వెనక్కి తగ్గలేదు. చేసేది లేక నేరుగా కాల్పులు జరిపారు. ఒక విద్యార్థి బుల్లెట్ తగిలి నేలకు ఒరిగాడు. ఆగ్రహించిన విద్యార్థులు బస్సులను తగలబెట్టారు. వేల కొద్దీ ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మేజిస్ట్రేట్ రెండోసారి ఫైరింగ్‌కి ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసులు కాల్పులలో చాలామంది బుల్లెట్లు తగిలి పడిపోయారు. ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా, మరో ఇద్దరు ఉస్మానియా హాస్పిటల్‌లో మరణించారు. సెప్టెంబర్ నాలుగున వారి మృతదేహాలతో ఊరేగింపు చేయాలని విద్యార్థులు నిర్ణయించుకొని ఉస్మానియా హాస్పిటల్‌కి బయలుదేరారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. కాల్పులు జరిపారు. దీంతో మరో నలుగురు మరణించారు. వందల మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు.
కాల్పులపై విచారణ
కాల్పుల మీద విచారణకు ముఖ్యమంత్రి బూర్గుల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి నేతృత్వాన కమిషన్ ఏర్పాటు చేశారు. 'కాల్పులలో మరణించింది అమాయకులే అయినా, కాల్పులను చట్ట విరుద్ధంగా పరిగణించలేం' అంటూ కమిషన్ 1952 డిసెంబర్ 28న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
నాన్ ముల్కీల ఆధిపత్యం, పరోక్షంగా వారికి అందుతున్న ప్రభుత్వాల మద్దతు సహజంగానే హైదరాబాద్ ప్రజల అసంతృప్తికి, అసహనానికి కారణమైంది. తదనంతరం మహత్తర ఉద్యమానికి దారితీసింది. తెలంగాణ స్వరాష్ట్రం గానే ఉండాలనే ఆకాంక్షకు బీజం వేసింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికీ దారులు వేసింది.
జక్కుల శ్రీనివాస్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
9701938358