నిర్మలమ్మ.. ఒక వీకెండ్ మూడ్!

         ఆమె 130 కోట్లమంది ఆర్థికానికి బాస్.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ఆర్థిక మంత్రి. అలాంటి హోదాలో ఉండి కీలకమైన బడ్జెట్ గురించి అడిగిన సాధారణ ప్రశ్నకు పొంతన లేని సమాధానం చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్‌పై ఎన్నో అంచనాలతో ఉన్న ప్రజలను నిరాశ పరిచిన తర్వాత ఆర్థిక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత శనివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ […]

Update: 2020-02-04 05:35 GMT

మె 130 కోట్లమంది ఆర్థికానికి బాస్.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ఆర్థిక మంత్రి. అలాంటి హోదాలో ఉండి కీలకమైన బడ్జెట్ గురించి అడిగిన సాధారణ ప్రశ్నకు పొంతన లేని సమాధానం చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్‌పై ఎన్నో అంచనాలతో ఉన్న ప్రజలను నిరాశ పరిచిన తర్వాత ఆర్థిక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత శనివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశీయ మార్కెట్‌ను అత్యంత దారుణంగా నిరాశ పరిచింది. బడ్జెట్‌లో ప్రస్తుత సమస్యలను తొలగించే నిర్ణయాలేవీ లేకపోవడంతో మదుపరులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో సూచీలన్నీ నష్టాల్లోకి పడిపోయాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్.. శనివారం రోజు మదుపరులు వీకెండ్ మూడ్‌లో ఉన్నారు. వారాంతం వల్లే సూచీలన్నీ నష్టాల్లోకి మళ్లాయి అన్న వ్యాఖ్యలకు అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.

సోమవారం ఢిల్లీలో ఫిక్కీ(FICCI) ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. దీనికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అందులో భాగంగా ‘బడ్జెట్ రోజున మార్కెట్ ఎందుకు సంతృప్తిగా లేదు?’ అని అడిగారు. దీనికి స్పందించిన నిర్మలా సీతారామన్ ‘ఇప్పుడు మార్కెట్‌లు సంతోషంగా ఉన్నాయి కదా.. శనివారం రోజున మదుపరులు వీకెండ్ మూడ్‌లో ఉన్నారు. సోమవారం అందరూ వర్క్ మూడ్‌లోని వచ్చారు అందుకే మార్కెట్ లాభాల్లోకి వచ్చేసింది’ అని సమాధానమిచ్చారు. దేశానికి ఆర్థిక మంత్రి ఇలాంటి హాస్యాస్పద కామెంట్లు చేయడం మార్కెట్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. ఆర్థిక మందగమనం ఉన్న సందర్భం, డిమాండ్ పడిపోవడం, ఆదాయ పన్నుపై ప్రజలందరూ గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు మరింత ఆందోళనకు గురి చేస్తాయి. కీలకమైన ఆర్థిక వ్యవస్థపై అడిగిన ప్రశ్నకు పొంతన లేని సమాధానం చెప్పకూడదు. నాణ్యమైన సమాధానాన్ని ప్రజలు కోరుకుంటారు అని కొందరు అభిప్రాయపడ్డారు.

శనివారం బడ్జెట్ సందర్భంగా మార్కెట్‌ను ప్రత్యేకంగా తెరిచారు. ఆ ఒక్కరోజే 988 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ సైతం రికార్డు స్థాయిలో 300 పాయింట్లు పతనమైన సంగతి తెలిసిందే! అయితే, సోమవారం మార్కెట్ కాస్త కోలుకుంది. అంతర్జాతీయ మార్కెట్ సానుకూలతలు సైతం మార్కెట్ బలపడ్డానికి సాయపడి సోమవారం ఒక్కరోజే సెన్సెక్స్ 137 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 46 పాయింట్లు లాభపడింది. ఇక మంగళవారం మార్కెట్ మరింత బలపడి నష్టపోయిన సూచీలన్నీ లాభాల్లోకి పయనించాయి. సెన్సెక్స్ ఏకంగా 900 పైగా పాయింట్లు లాభపడింది. నిఫ్టీ సైతం 250 పైగా పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.

Tags:    

Similar News