Rain Alert: ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో దంచికొడుతున్న భారీ వర్షం
రాష్ట్రంలో గత కొద్ది రోజుల క్రితం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత కొద్ది రోజుల క్రితం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పంటపొలాలు, రహదారులు చెరువులను తలపించాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. భారీ వరదలు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాయి. ఈ వరదల కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయనుకుంటే మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కాకినాడ, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. బ్రహ్మంగారి మఠం-బద్వేల్ మధ్య వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలోని మెదక్ జిల్లాలో కుండపోత వర్షానికి ఏడుపాయల వన దుర్గాలయం జలదిగ్భంధంలో చిక్కుకుంది. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రెండో రోజూ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.