భగీరథ నీళ్లు తాగలేం.. ప్రభుత్వ కార్యాలయాల్లో వాటర్ ప్రాబ్లం
దిశ, తెలంగాణ బ్యూరో: 2020, డిసెంబర్ 16, “ భగీరథ కంటే స్వచ్చమైన తాగునీరు ఇంకెక్కడా దొరకదు. అంగన్ వాడీలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, వైద్యసంస్థలతో పాటు ధార్మిక సంస్థలకు కూడా భగీరథ వాటర్ మాత్రమే వాడాలి. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భగీరథ వాటర్ బాటిల్స్ ను ఉపయోగించాలి. కొత్తగా నిర్మిస్తున్న రైతు వేదికలు, వైకుంఠదామాలకు భగీరథ నీటిని అందించాలి.” ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల సీఈ, ఎస్ఈల సమీక్షా సమావేశంలో మిషన్ భగీరథ […]
దిశ, తెలంగాణ బ్యూరో: 2020, డిసెంబర్ 16, “ భగీరథ కంటే స్వచ్చమైన తాగునీరు ఇంకెక్కడా దొరకదు. అంగన్ వాడీలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, వైద్యసంస్థలతో పాటు ధార్మిక సంస్థలకు కూడా భగీరథ వాటర్ మాత్రమే వాడాలి. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భగీరథ వాటర్ బాటిల్స్ ను ఉపయోగించాలి. కొత్తగా నిర్మిస్తున్న రైతు వేదికలు, వైకుంఠదామాలకు భగీరథ నీటిని అందించాలి.” ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల సీఈ, ఎస్ఈల సమీక్షా సమావేశంలో మిషన్ భగీరథ స్పెషలాఫీసర్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్.
2021, జనవరి 20,
“ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మిషన్ భగీరథ నీళ్లను వాడుతున్నాం. దీని కోసం ప్రత్యేకంగా బాటిళ్లను తయారు చేయించాం. ఈ నీటి బాటిళ్లు తయారు చేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉచితంగా అందిస్తున్నాం. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నింటా ఇవే నీళ్లు ఉంటాయి. నీళ్ల ఖర్చు ఆఫీసుల్లో, గ్రామ పంచాయతీల్లో మొత్తం తగ్గిపోయింది.” సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ మిషన్ భగీరథ వద్ద జరిగిన మిషన్ భగీరథ రాష్ట్ర స్థాయి సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యలు. ప్రభుత్వ కార్యాలయాల్లో సరఫరా చేసేందుకు మిషన్ భగీరథ వాటర్ బాటిళ్లను మంత్రి ఆవిష్కరించారు.
ఇది మన మంత్రులు, అధికారులు చెప్పుతున్న మిషన్ భగీరథ వాటర్ కథలు. కానీ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో మన అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేసింది.
జీవో నెంబర్ 59 ప్రకారం.. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగస్టు 31 నాటికి వాటర్ క్యాన్ల కొనుగోలుకు రూ. 3600 విడుదల చేసింది. విమలా ఎంటర్‌ప్రైజెస్‌కు ఈ బిల్లు చెల్లించింది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కార్యాలయంలో తాగునీటి వాటర్ క్యాన్ల ద్వారా తెప్పించుకున్నట్లు జీవోలో వెల్లడించింది. అంతేకాకుండా ఇటీవల పలు కార్యాలయాలకు తాగునీటి బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది.
మేం వాడం
ప్రభుత్వ కార్యాలయాల్లో మిషన్ భగీరథ తాగునీటిని వాడేందుకు వెనకాడుతున్నారు. కొన్ని ఆఫీసులకు దీనికోసం ప్రత్యేకంగా నల్లా కనెక్షన్లు కూడా ఇచ్చారు. కానీ వాటిని ఎలా వినియోగించాలో తెలువడం లేదంటూ చెప్పుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ మిషన్ భగీరథ వాటర్ బాటిళ్లు ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఒక్క బాటిల్ కూడా ఇవ్వడం లేదని అధికారులు చెప్పుతున్నారు. దీంతో తప్పలేక మినరల్ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తున్నామని, మినరల్ వాటర్ క్యాన్లను తెప్పించుకుంటామని వెల్లడిస్తున్నారు.
రాష్ట్రంలో మిషన్ భగీరథ ప్రాజెక్టుపై రూ. 33 వేల 400 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న జలాలను పకడ్బందీగా శుద్ధి చేస్తున్నామని, ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ధేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జలాల శుద్ధి జరుగుతోందని ప్రకటిస్తోంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నందుకే మినరల్ వాటర్ కంటె మిషన్ భగీరథ నీరు సురక్షితమని, అందుకే అందరూ ఈ నీటినే తాగాలంటూ ప్రచారం చేసింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని మిషన్ భగీరథ కేంద్ర కార్యాలయంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కార్యాలయాల్లో ఈ నీటిని ఫైలట్ ప్రాజెక్టుగా తీసుకుని వినియోగిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇది మూడు రోజుల ముచ్చటగానే మారింది. ప్రస్తుతం ఈ కార్యాలయాలన్నింటా మినరల్ వాటర్‌నే వాడుతున్నారు.