రణరంగంగా మారిన కౌన్సిల్ హాల్
దిశ, వరంగల్ తూర్పు: వరంగల్ నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ రణరంగంగా మారింది. కేవలం గంటపాటు నిర్వహించిన సమావేశంలో యాభై నిమిషాలకుపైగా దూషనలు, నినాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే గడిచింది. అధికార పార్టీ సభ్యలందరూ ఒక్కసారిగా బీజేపీకి చెందిన కార్పొరేటర్‌పై విరుచుకుపడడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక దశలో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అందరూ శాంతంగా ఉంటేనే సభ సజావుగా జరుగుతుందంటూ మేయర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఎలాంటి […]
దిశ, వరంగల్ తూర్పు: వరంగల్ నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ రణరంగంగా మారింది. కేవలం గంటపాటు నిర్వహించిన సమావేశంలో యాభై నిమిషాలకుపైగా దూషనలు, నినాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే గడిచింది. అధికార పార్టీ సభ్యలందరూ ఒక్కసారిగా బీజేపీకి చెందిన కార్పొరేటర్‌పై విరుచుకుపడడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక దశలో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అందరూ శాంతంగా ఉంటేనే సభ సజావుగా జరుగుతుందంటూ మేయర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఎలాంటి చర్చలు లేకుండానే సభను మధ్యాంతరంగానే ముగిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.
అరుపులు, కేకలు..
సోమవారం వరంగల్ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ గుండా ప్రకాశ్‌రావు అధ్యక్షతన జరిగింది. కౌన్సిల్‌లో చర్చను ప్రారంభించేందుకు మేయర్ అవకాశం ఇచ్చారు. తొలుత 45వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ చాడ స్వాతిరెడ్డి లేచి కార్పొరేషన్ ఆవరణలో దిక్షా దివస్ పైలాన్ ఆవిష్కరించడాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ ఒక్కరే తెలంగాణ తేలేదన్నారు. 1200 మంది అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్ దీక్ష చేసిన ప్రాంతంలో ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు ఒక్క సారిగా అభ్యంతరం చెప్పారు. అందరూ బల్లలు కొడుతూ బీజేపీ డౌన్‌డౌన్.. తెలంగాణ వ్యతిరేక పార్టీ బీజేపీ అంటూ నినదించారు. కేసీఆర్ జిందాబాద్, టీఆర్‌ఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కార్పొరేటర్ సభకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అరుపులు, కేకలతో సభ మార్మోగింది. సభ్యులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పోడియం ఎదుట బైఠాయింపు..
కౌన్సిల్‌లో ఉన్న ఒకే ఒక బీజేపీ కార్పొరేటర్‌పై అధికార పార్టీ సభ్యలు దూషనలతో దాడికి దిగడంతో బీజేపీ కార్పొరేటర్ స్వాతిరెడ్డి పోడియం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఎంబాడి రవీందర్ స్వాతిరెడ్డికి అండగా నిలిచారు. మేయర్‌కు తన గోడును వెళ్లబుచ్చారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ స్వాతిరెడ్డి వేడుకోవడంతో మేయర్ సానుకూలంగా స్పందించారు.
పైలాన్ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు..
పైలాన్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఎంబాడి రవీందర్ ప్రకటించారు. కాని పైలాన్ ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి చేసిన వాఖ్యలు బాధించాయన్నారు. 1200 మంది బలిదానాలతోనే తెలంగాణ ఏర్పడిందంటూ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కీలక భూమిక నిర్వహించిందన్నారు. పైలాన్ ఏర్పాటుకు చేసిన తీర్మాణంలో మేము కూడా భాగస్వాములమే అంటూ గుర్తు చేశారు. మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. దీంతో అధికార పార్టీ కార్పొరేటర్లు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడైన ఎంబాడి రవీందర్ ఇలా మాట్లాడడం సరికాదన్నారు.
కార్పొరేషన్ ఎదుట బైఠాయింపు..
సభలో వాడి వేడి దూషనలు జరుగుతుండగానే బీజేపీ కార్పొరేటర్ సభ నుంచి నిష్క్రమించారు. బల్దియా ప్రధాన ద్వారానికి అడ్డుగా బైఠాయించి నిరసన తెలిపారు. అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. కొంతసేపు అక్కడే కూర్చుండి నిరసన తెలిపారు. అనంతరం తిరిగి సమావేశ మందిరానికి వెళ్లిపోయారు.
‘ఒక్క అవకాశం ఇవ్వండి’
తిరిగి సమావేశ మందిరానికి చేరుకున్న స్వాతిరెడ్డి.. అన్నా.. మాట్లాడేందుకు ఒక్క అవకాశం ఇవ్వండంటూ వేడుకుంది. దీనికి మేయర్ సానుకూలంగా స్పందించి ఆమెకు అవకాశం కల్పించారు. సభను అగౌరవ పరుస్తూ సభనుంచి వెళ్లి పోయిన కార్పొరేటర్‌కు తిరిగి మాట్లాడేందుకు ఎలా అవకాశం కల్పిస్తారంటూ పాలక సభ్యులు మేయర్‌ను నిలదీశారు. దీంతో ఆమె తిరిగి పోడియం వద్దకు చేరుకున్నారు. అధికార పార్టీ కొర్పొరేటర్లు కూడా నిరసన తెలుపుతూ పోడియం వద్దకు చేరుకున్నారు. రాజకీయ లబ్ధి కోసమే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
సభను ముగిస్తున్నా..
కార్పొరేటర్లందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తా.. ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాల్సిందిగా మేయర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఎజెండాలోని అంశాలన్నింటినీ ఆమోదించినందున సభను ముగిస్తున్నట్లు మేయర్ గుండా ప్రకాశ్‌రావు ప్రకటించారు.
కౌన్సిల్ ఆమోదంతోనే పైలాన్ ఏర్పాటు..
కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదంతోనే నగర పాలక సంస్థ పరిధిలో దీక్షా దివస్ పైలాన్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రకటించారు. సమావేశం అనంతరం కార్పొరేషన్ ప్రాంగణంలో వారు మాట్లాడుతూ నిబంధనల మేరకు పైలాన్ ఏర్పాటు జరిగిందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకే కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
క్షీరాభిషేకం..
సమావేశం అనంతరం దీక్షా వివస్ పైలాన్‌కు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. టీఆర్‌ఎస్, కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.
రూ.250కోట్లతో 171 పనులకు ఆమోదం..
సమావేశం ప్రారంభం కాగానే రూ.150.49కోట్లతో ఎజెండాలో ప్రవేశపెట్టిన 86 పనులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం రూ.100కోట్లతో మొత్తం 91 పనులతో ప్రవేశపెట్టిన టేబుల్ ఎజెండాను చదువుతుండగానే సభ్యులంతా ముక్త కంఠంతో వాటన్నింటినీ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
గంట ఆలస్యంగా..
ఉదయం 11 గంటలకు ప్రారంభించాల్సిన బల్దియా సర్వసభ్య సమావేశాన్ని గంట ఆలస్యంగా ప్రారంభం అయింది. కమిషనర్ లేకపోవడంతో అధికారులు ఎవరూ నిర్ణీత సమయంలో చేరుకోలేదు. మేయర్ ఉదయమే కార్యాలయానికి చేరుకున్నా సమావేశ మందిరానికి మాత్రం రాలేదు. కార్పొరేటర్లది కూడా అదే దారి కావడంతో 12.15గంటల వరకు సమావేశ మందిరం బోసిపోయి కనిపించింది. 12.15గంటలకు ప్రారంభమైన సమావేశం కేవలం గంటపాటు మాత్రమే కొనసాగి 1.15గంటలకు ముగిసింది.