రేవంత్ vs మల్లారెడ్డి.. అగ్గిరాజేసిన ఏడేళ్ల పగ

దిశ ప్రతినిధి, మేడ్చల్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఎపిసోడ్ రసవత్తరంగా కొనసాగుతూనే ఉంది. సీఎం దత్తత గ్రామం మూడు చింతలపల్లి వేదికగా ప్రారంభమైన వీరిద్దరి హాట్ కామెంట్లు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మల్లారెడ్డిని జోకర్, బ్రోకర్‌ అని రేవంత్ రెడ్డి సంబోధించగా, రేవంత్ రెడ్డి బ్రోకర్, బ్లాక్ మెయిలర్ అంటూ పరుష పదజాలంతో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్‌‌ను పెంచాయి. దీనికి […]

Update: 2021-08-28 19:00 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఎపిసోడ్ రసవత్తరంగా కొనసాగుతూనే ఉంది. సీఎం దత్తత గ్రామం మూడు చింతలపల్లి వేదికగా ప్రారంభమైన వీరిద్దరి హాట్ కామెంట్లు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

మల్లారెడ్డిని జోకర్, బ్రోకర్‌ అని రేవంత్ రెడ్డి సంబోధించగా, రేవంత్ రెడ్డి బ్రోకర్, బ్లాక్ మెయిలర్ అంటూ పరుష పదజాలంతో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్‌‌ను పెంచాయి. దీనికి తోడు దమ్ముంటే పీసీసీ, ఎంపీ పదవికి రాజీనామా చేసి, తనతో ఎన్నికల్లో తలపడాలని మల్లారెడ్డి సవాల్ విసిరారు. దీంతో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల శ్రేణులు తమ నాయకులు మాట్లాడిందే కరెక్ట్ అంటూ.. అపోజిషన్ లీడర్ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ.. పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇద్దరి మధ్య ఏడేళ్ల నాటి వైరం..

ఎంపీ రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డిల మధ్య ఏడేళ్లుగా వైరం కొనసాగుతున్నది. ఇదే విషయాన్ని శనివారం ప్రెస్‌మీట్‌లో మంత్రి మల్లారెడ్డి బయటపెట్టారు. 2014 సాధారణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ను ఆశించారు. అదే స్థానంపై విద్యా సంస్థల అధినేతగా పేరుగాంచిన చామకూర మల్లారెడ్డి సైతం కన్నేశారు. ఎట్టకేలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఒప్పించి మల్లారెడ్డి ఎంపీ టికెట్‎ను కైవసం చేసుకున్నారు. దీంతో మల్కాజిగిరిలో తనను పోటీ చేయకుండా మల్లారెడ్డి అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై ఫైర్ అయ్యారు. దీంతో రంగారెడ్డి జిల్లా ముఖ్య నేతల మధ్య వర్తిత్వంతో ఇరువురు నేతల మధ్య రాజీ కుదిరింది. ఈ క్రమంలో ఎంపీగా మల్లారెడ్డి గెలుపొందారు. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు. మల్లారెడ్డి ఆహ్వానం మేరకు పార్టీ తరఫున పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారం కూడా నిర్వహించారు.

పార్టీలు మారడంతో మళ్లీ రగడ..

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ప్రభావంతో మల్లారెడ్డి కారు పార్టీలో చేరగా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. 2018 ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికై, మంత్రి అయ్యారు. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఓడిపోయారు. ఇదే సమయంలో శాసన సభ, పార్లమెంట్‌లకు వేర్వేరుగా ఎన్నికలు జరగడం రేవంత్‌ రెడ్డికి కలిసొచ్చింది. 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ టికెట్‌‌ను టీడీపీ నుంచి ఆశించి.. మల్లారెడ్డి చేతిలో భంగపడ్డ రేవంత్‌కు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి మల్లారెడ్డి స్వయాన అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డితో రేవంత్ తలపడి ఎంపీగా గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిష్టానంతో పాటు మంత్రి మల్లారెడ్డి.. రేవంత్ రెడ్డిని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డారు. కానీ, స్వల్ప మెజారిటీతో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇలా మల్లారెడ్డిపై తన పంతాన్ని రేవంత్ రెడ్డి నెగ్గించుకున్నట్లైంది. అయితే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే.. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉండడంతో వీలు చిక్కినప్పుడల్లా ఈ నేతల మధ్య రాజకీయ వైరం నడుస్తూనే ఉంది.

ప్రధానంగా మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంలోని సీఎం దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో ఈ నెల 25న నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్షలో మంత్రిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు పరుష పదజాలంతో దూషించుకునే స్థాయికి వెళ్లాయి. అవినీతి ఆరోపణలతో పాటు వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడంతో ఇరు పార్టీల కింది స్థాయి నాయకులు, కార్యకర్తల మధ్యన అగ్గిని రాజేస్తున్నాయి.

Tags:    

Similar News