ఫేస్ వైజర్ల వల్ల ఉపయోగముందా?
ఫేస్ మాస్క్‌లు, ఎన్95 మాస్క్‌లతో ఇబ్బందిగా ఫీల్ అవుతున్న వారు ఫేస్ వైజర్లు ధరించి కరోనా వైరస్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బ్యూటీ పార్లర్లు, సెలూన్లు, కాఫీ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్నవాళ్లు ఈ వైజర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చూడటానికి క్లాస్సీగా కనిపిస్తున్న ఈ వైజర్ల వాడకం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా? నిజంగా ఇవి వైరస్‌ను అడ్డుకుంటున్నాయా? మాస్క్‌లకు ప్రత్యామ్నాయంగా వీటిని వాడటం ఎంత వరకు సబబు? అనే విషయాల గురించి స్పష్టత లేకుండా […]
ఫేస్ మాస్క్‌లు, ఎన్95 మాస్క్‌లతో ఇబ్బందిగా ఫీల్ అవుతున్న వారు ఫేస్ వైజర్లు ధరించి కరోనా వైరస్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బ్యూటీ పార్లర్లు, సెలూన్లు, కాఫీ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్నవాళ్లు ఈ వైజర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చూడటానికి క్లాస్సీగా కనిపిస్తున్న ఈ వైజర్ల వాడకం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా? నిజంగా ఇవి వైరస్‌ను అడ్డుకుంటున్నాయా? మాస్క్‌లకు ప్రత్యామ్నాయంగా వీటిని వాడటం ఎంత వరకు సబబు? అనే విషయాల గురించి స్పష్టత లేకుండా వీటిని ఉపయోగిస్తున్నారు. శాస్త్రవేత్తల దృష్టిలో ఈ వైజర్లు బాగానే పనిచేస్తాయని తేలింది. కానీ అన్ని పరిస్థితుల్లోనూ వాటిపై ఆధారపడటం కూడా కరెక్ట్ కాదని వాళ్లే చెబుతున్నారు.
మనుషులు మాట్లాడినపుడు వెలువడే తుంపర్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఈ తుంపర్లు సాధారణంగా మాట్లాడినపుడు 1.5 మీ.లు ప్రయాణిస్తాయి. అదే దగ్గినపుడు 1.9 మీ. వరకు, తుమ్మినపుడు ఏకంగా 8 మీ.ల వరకు ప్రయాణిస్తాయి. వీటిని అడ్డుకోవడానికి వైజర్లు బాగానే పనిచేస్తాయి. తుమ్మిన వ్యక్తి నుంచి మాత్రమే కాకుండా ఇతరులు తుమ్మినపుడు తుంపర్లు మీద పడకుండా వైజర్లు కాపాడతాయి. కానీ అతి దగ్గరగా ఉండి చేసే వృత్తులైన బ్యూటీషియన్, బార్బర్‌లు ఈ వైజర్లతో సరిపెట్టుకోవడం మంచిది కాదు. అందుకు ఉదాహరణగా స్విట్జర్లాండ్‌లోని గ్రాబుండెన్ హోటల్‌లో జరిగిన సంఘటనను తీసుకోవచ్చు. ఆ హోటల్‌లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. వీళ్లందరూ వైజర్లు ధరించి ఉండటం గమనార్హం.
అయితే ఈ వైజర్ల వల్ల లాభాలు కూడా లేకపోలేదు. కరోనా వైరస్ కళ్ల గుండా కూడా వ్యాపించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. వైజర్ ధరించడం వల్ల ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఎవరి ముఖాన్ని వారే ముట్టుకోవడాన్ని వైజర్ తగ్గిస్తుంది. మాస్క్‌ల కంటే వైజర్లు ధరించడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిని ధరించినపుడు శ్వాసించడానికి పెద్దగా ఇబ్బంది కలగదు. కాబట్టి వైజర్లు ధరించడం ఒకందుకు మంచిదే కానీ మాట్లాడేటపుడు దూరంగా ఉండటం, తరచుగా వైజర్లను శానిటైజ్ చేయడం వల్ల కొంత రక్షణ పొందవచ్చు. అలాగే ఎక్కువ మందితో కలిసి పనిచేసే చోట వైజర్‌తో పాటు మాస్క్ కూడా ధరించడం ఉత్తమమని వైద్యులు సలహా ఇస్తున్నారు.