టీకా కంపెనీలు.. కేంద్ర ప్రభుత్వంతోనే డీల్
న్యూఢిల్లీ: ప్రపంచంలోని ప్రముఖ టీకా కంపెనీలు వ్యాక్సిన్‌లను రాష్ట్రాలకు విడిగా విక్రయించడానికి మొగ్గు చూపడం లేదని, అవి నేరుగా కేంద్ర ప్రభుత్వంతోనే డీల్ చేసుకుంటామని వివరిస్తున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అన్నారు. టీకా ఉత్పత్తిదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు హాస్పిటళ్లు వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ, దేశంలోని రెండు టీకా కంపెనీల్లో సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో విదేశీ కంపెనీల కోసం గ్లోబల్ టెండర్లు […]
న్యూఢిల్లీ: ప్రపంచంలోని ప్రముఖ టీకా కంపెనీలు వ్యాక్సిన్‌లను రాష్ట్రాలకు విడిగా విక్రయించడానికి మొగ్గు చూపడం లేదని, అవి నేరుగా కేంద్ర ప్రభుత్వంతోనే డీల్ చేసుకుంటామని వివరిస్తున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అన్నారు. టీకా ఉత్పత్తిదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు హాస్పిటళ్లు వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ, దేశంలోని రెండు టీకా కంపెనీల్లో సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో విదేశీ కంపెనీల కోసం గ్లోబల్ టెండర్లు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు టీకాల కోసం ఆర్డర్ చేయగా, అందుకు అవి తిరస్కరించాయని కేజ్రీవాల్ వివరించారు. అవి కేంద్ర ప్రభుత్వంతోనే టచ్‌లో ఉన్నాయని, రాష్ట్రాలకు విడిగా డీల్ చేసుకోబోమని స్పష్టం చేశాయని తెలిపారు. మొడెర్నా సంస్థ పంజాబ్ ప్రభుత్వంతోనూ ఇలాగే పేర్కొన్నట్టు సీఎం అమరిందర్ సింగ్ ఆదివారం వెల్లడించిన సంగతి తెలిసిందే.
కొంచెం సీరియస్‌నెస్ చూపించండి: సిసోడియా
రాష్ట్రాలే టీకాలు కొనుగోలు చేసుకోవాలని పేర్కొన్న కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మండిపడ్డారు. ‘జాన్సన్ అండ్ జాన్సన్, మొడెర్నా, ఫైజర్‌లు కేంద్ర ప్రభుత్వంతో టచ్‌లో ఉన్నాయని చెప్పాయి. రాష్ట్రాలకు టీకా అందించమని స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వమేమో గ్లోబల్ టెండర్లు వేయాలని మమ్మల్ని ఆదేశించింది. అలాగే, విడిగా ఆ కంపెనీలతో టచ్‌లో ఉంది. భారత్‌లోని కంపెనీలతో కొనుగోలు చేసుకోమని కేంద్రం చెప్పింది. అలాగని, వాటి దగ్గరకు వెళ్తే సరఫరాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. రాష్ట్రాలకు ఎంతమొత్తంలో అమ్మాలో డిసైడ్ చేసింది. దేశమంతా వణికిస్తున్న కరోనా మహమ్మారిపై కేంద్రం ఇంత ఉదాసీనంగా ఉండటమేంటీ?’ అని ప్రశ్నించారు.
టీకా పంపిణీపై ముందు చూపేదీ?
అంతర్జాతీయంగా అనుమతి పొంది వినియోగాన్ని మొదలుపెట్టిన టీకాలను ఆమోదించడానికి ఎందుకంత అలసత్వమని కేంద్రాన్ని సిసోడియా ప్రశ్నించారు. ‘ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్‌లకు గతేడాది డిసెంబర్‌లోనే అమెరికా అనుమతినిచ్చింది. మన ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. ఇతర దేశాలు వాటికీ అనుమతినివ్వడమే కాదు.. వినియోగించడాన్నీ ప్రారంభించాయి. ఇండియా ఈ దుస్థితిని అనుభవించాల్సిన అవసరమేముంది? మనదేశం కేవలం రెండే కంపెనీలపై ఆధారపడింది. అవి కూడా విదేశాలకు టీకాలను ఎగుమతి చేస్తున్నాయి. రష్యా స్పుత్నిక్ వీకి ఆగస్టులో అనుమతినిచ్చి డిసెంబర్‌లో పంపిణీని మొదలుపెట్టింది. మనదేశం ఇంకా నిద్రవీడలేదు. యూకే డిసెంబర్‌లోనే ఫైజర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 85దేశాలు ఫైజర్‌కు అనుమతులు ఇవ్వగా, 46దేశాలు మొడెర్నాకు, 41 దేశాలు జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను ఆమోదించాయి. కానీ కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తూనే ఉన్నది. రాష్ట్రాలు గ్లోబల్‌గా టెండర్లు వేసి కొనుగోలు చేసుకోండని ఆదేశిస్తుంది.. కానీ, వాటికి ఇంకా అప్రూవల్ ఇవ్వదు. ఈ సీరియస్ సిచువేషన్ కేంద్రానికి జోక్‌గా కనిపిస్తున్నదా?’ అని మండిపడ్డారు.