కంటైన్‌మెంట్ మినహా.. తెలంగాణ అన్‌లాక్
దిశ, న్యూస్ బ్యూరో: వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్ జోన్లు మినహా తెలంగాణలో పూర్తిస్థాయి సడలింపులు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ప్రకటించిన నిషేధిత జాబితాలోని అంశాలు తప్ప దుకాణాలన్నీ యథావిధిగా తెరుచుకోనున్నాయి. గ్రామాలు, రాజధాని మధ్య రాకపోకలు షురూ కానున్నాయి. క్యాబ్ సర్వీసులు, కార్లు, టాక్సీల చక్రాలు తిరగనున్నాయి. రాత్రిపూట వేళల్లో కర్ఫ్యూ ఇప్పుడున్నట్లుగానే ఉంటుందన్నారు. వైరస్ బారిన పడకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనన్నారు.మాస్కు లేకుండా బయట కనిపిస్తే రూ.1000 ఫైన్ […]
దిశ, న్యూస్ బ్యూరో:
వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్ జోన్లు మినహా తెలంగాణలో పూర్తిస్థాయి సడలింపులు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ప్రకటించిన నిషేధిత జాబితాలోని అంశాలు తప్ప దుకాణాలన్నీ యథావిధిగా తెరుచుకోనున్నాయి. గ్రామాలు, రాజధాని మధ్య రాకపోకలు షురూ కానున్నాయి. క్యాబ్ సర్వీసులు, కార్లు, టాక్సీల చక్రాలు తిరగనున్నాయి. రాత్రిపూట వేళల్లో కర్ఫ్యూ ఇప్పుడున్నట్లుగానే ఉంటుందన్నారు. వైరస్ బారిన పడకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనన్నారు.మాస్కు లేకుండా బయట కనిపిస్తే రూ.1000 ఫైన్ తప్పదని సీఎం తేల్చిచెప్పారు. కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం కఠినమైన ఆంక్షలు ఉంటాయని, కదలికలు పూర్తిగా నిషేధమన్నారు.
హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు, కంటైన్‌మెంట్ జోన్లు ఎక్కువగా ఉన్నందున ఎక్కడెక్కడ దుకాణాలు ఎలా తెరుచుకోవాలో జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటిస్తారని సీఎం చెప్పారు. సిటీ బస్సులు మాత్రం ఇప్పటికి డిపోలకే పరిమితమన్నారు. ప్రజల రద్దీని నివారించడానికి దుకాణాలను సరిబేసి పద్ధతిలో తెరవడమా లేక రోజుమార్చి రోజు తెరవడమా అనేదానిపై జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయిస్తారని వివరంచారు. అన్ని షాపులూ తెరుచుకోవచ్చునని, ఎలాంటి ఆంక్షలు లేవని, వ్యాపార లావాదేవీలు మామూలు రోజుల్లో జరిగినట్లుగానే ఉంటాయన్నారు. అయితే శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్స్ లాంటి నిబంధనలను ప్రజలు, దుకాణాల యజమానులు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. గత 10రోజులుగా రాష్ట్రంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అమలవుతున్న సడలింపుల అనంతర పరిస్థితిని సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.కంటైన్‌మెంట్ జోన్లు మినహా రాష్ట్రమంతటా సెలూన్లు కూడా తెరుచుకోవచ్చునని తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో 1,452 కుటుంబాలు కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్నాయన్నారు. వీటిని హాట్ స్పాట్‌లుగా ప్రభుత్వం గుర్తించిందని, బయట వారు ఎవ్వరూ ఈ జోన్లలోకి వెళ్ళరాదని, వెళితే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్నారు. అన్ని రాష్ట్రాల్లోని పరిస్థితులను పరిశీలించాకే ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయాలు తీసుకున్నదన్నారు. ఇప్పట్లో కరోనాకు వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదని శాస్ర్తవేత్తలు చెబుతున్నారని, కావున ప్రపంచమే కరోనాతో కలిసి జీవించడం మినహా మరో గత్యంతరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
నగరంలో టాక్సీలు, కార్లలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు, ఆటోల్లో మాత్రం డ్రైవర్ కాకుండా మరో ఇద్దరు ప్రయాణించడానికి అనుమతి ఉందన్నారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే పోలీసులు చలాన్‌లు విధిస్తారన్నారు. డ్రైవర్లు ప్రభుత్వానికి సహకరించాలని, ప్రజలు కూడా నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రభుత్వ , ప్రైవేటు ఆఫీసులు 100శాతం సిబ్బందితో పనిచేస్తాయని, వారికి ఎలాంటి ఆంక్షలు లేవని, స్టాఫ్ మొత్తం హాజరుకావొచ్చన్నారు.పరిశ్రమలు, కంపెనీలు, ఉత్పత్తి సంస్థలు నిబంధనల ప్రకారం మసులుకోవాలన్నారు. అన్ని విద్యా సంస్థలు, కోచింగ్ సంస్థలు, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాళ్ళు, సినిమాహాళ్ళు, స్టేడియంలు, మత ప్రార్థనా స్థలాలు, ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ఎమ్యూజ్‌మెంట్ పార్కులు, క్లబ్బులు, పబ్‌లు, రెస్టారెంట్లు… ఇవన్నీ ఈ నెల 31 వరకూ మూసివేసే ఉంటాయన్నారు.
ఆంక్షలు సడలించినందున ప్రజలు అవసరం ఉంటేనే రోడ్లమీదకు రావాలని, లేకుంటే ఇండ్లకే పరిమితం కావాలని కేసీఆర్ సూచించారు. 60 ఏళ్ళ వయసు దాటిన వృద్ధులు అత్యవసర పనులు ఉంటే మాత్రమే గడప దాటి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు.ఈ నెల 31తర్వాత మళ్ళీ సమీక్షించి తదనుగుణమైన మిగతా నిర్ణయాలు తీసుకోనున్నట్లు కేసీఆర్ తెలిపారు.