ధాన్యం కొనుగోలుపై తేల్చిచెప్పిన పీయూష్ గోయల్
దిశ, డైనమిక్ బ్యూరో: యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల స్పష్టతనివ్వాలని పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తోన్న నిరసన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంపీలంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో స్పష్టం చేయాలంటూ ఎంపీ కేకే కేంద్రాన్ని ప్రశ్నించగా.. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ సమాధానమిచ్చారు. ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఈ […]
దిశ, డైనమిక్ బ్యూరో: యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల స్పష్టతనివ్వాలని పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తోన్న నిరసన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంపీలంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో స్పష్టం చేయాలంటూ ఎంపీ కేకే కేంద్రాన్ని ప్రశ్నించగా.. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ సమాధానమిచ్చారు. ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయం గురించి ఇదివరకే సీఎం కేసీఆర్ తో మాట్లాడినట్లు వెల్లడించారు. రాష్ట్రం నుంచి 24 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించేందుకు ఒప్పందం జరగ్గా తర్వాత దానిని 44 లక్షల టన్నులకు పెంచామని గుర్తుచేశారు.
అయితే, ఇప్పటి వరకు 27 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే వచ్చిందని, ఇంకా 17లక్షల టన్నులు పెండింగ్ ఉన్నాయన్నారు. వాటిని పంపించకుండా భవిష్యత్ గురించి తెరాస ప్రశ్నిస్తోందని మండిపడ్డారు. అంతేకాకుండా.. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ కొనలేమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఎంవోయూలో స్పష్టంగా నమోదు చేశామని వెల్లడించారు. తెలంగాణలో ధాన్యం సేకరణలో ప్రభుత్వం తెలిపిన అంచనాలకు, వాస్తవాలకు చాలా తేడా ఉంటోందని ఆరోపించారు. ఖరీఫ్ సీజన్‌లో కూడా 50 లక్షల టన్నులు ఇస్తామని చెప్పి.. ఇప్పటివరకు 32.66 లక్షల టన్నులే పంపించారన్నారు. ఎంవోయూకు కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని కేంద్రమంత్రి అన్నారు. రాష్ట్రం నుంచి ఇకపై బాయిల్డ్ రైస్ పంపబోమని తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 4న కేంద్రానికి లేఖ రాసిందని తెలిపారు. పంపమని చెప్పి ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొనాలని గొడవ చేస్తూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత వరకూ తెలంగాణకు సహకరిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.