కంపు కొడుతున్న కరీంనగర్ మున్సిపాలిటీ
దిశ, కరీంనగర్ సిటీ: నగరంలోని పలు డివిజన్లలో అంతర్గత రహదారుల పరిస్థితి పైన పటారం.. లోన లొటారం అన్నట్లుగా తయారైంది. స్మార్ట్ సిటీ కింద ప్రధాన రహదారులన్నీ ఆధునీకరిస్తుండగా డివిజన్లలోని కాలనీల్లో రోడ్లు మురికి కాల్వల అభివృద్ధిని బల్దియా పాలకవర్గం విస్మరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు డివిజన్లు కాలనీని కలుపుతూ, రోడ్లు విస్తరిస్తూ ఉండగా, ఆయా కాలనీలు డివిజన్‌లోని అంతర్గత రోడ్లు మురికి కాలువల నిర్మాణ పనులు మాత్రం చేపట్టకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. రోడ్లపైనే మురుగునీరు.. మొదటగా […]
దిశ, కరీంనగర్ సిటీ: నగరంలోని పలు డివిజన్లలో అంతర్గత రహదారుల పరిస్థితి పైన పటారం.. లోన లొటారం అన్నట్లుగా తయారైంది. స్మార్ట్ సిటీ కింద ప్రధాన రహదారులన్నీ ఆధునీకరిస్తుండగా డివిజన్లలోని కాలనీల్లో రోడ్లు మురికి కాల్వల అభివృద్ధిని బల్దియా పాలకవర్గం విస్మరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు డివిజన్లు కాలనీని కలుపుతూ, రోడ్లు విస్తరిస్తూ ఉండగా, ఆయా కాలనీలు డివిజన్‌లోని అంతర్గత రోడ్లు మురికి కాలువల నిర్మాణ పనులు మాత్రం చేపట్టకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు.
రోడ్లపైనే మురుగునీరు..
మొదటగా లోతట్టు ప్రాంతాల్లో గల రోడ్లు మురికి కాలువల నిర్మాణ పనులు చేపట్టాల్సిన యంత్రాంగం, ఇందుకు విరుద్ధంగా ప్రధాన రహదారుల వెంట డ్రైనేజీలు నిర్మిస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల నుంచి మురుగునీరు బయటకు వెళ్లేందుకు అవకాశం లేక రోడ్లపైనే పారుతూ, దుర్గంధం వెదజల్లుతోంది. మరికొన్ని చోట్ల రోడ్డంతా విస్తరించి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నగర వాసులు వాపోతున్నారు.
భగత్‌నగర్ సమీపంలోని శివాలయం వెనుక వైపు రోడ్డుపై, బృందావన్ గార్డెన్‌కు వెళ్లే దారిపై డ్రైనేజీ నీరు ఏరులై పారుతోంది. డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతుండగా మురుగు నీటిని దారి మళ్లించడంతో కింది రోడ్లపైకి చేరి నిలిచి ఇళ్లలోకి వస్తోందని కాలనీల వాసులు మండిపడుతున్నారు. పదిహేను రోజుల నుంచి నిరంతరాయంగా వస్తున్న వాసనతో రోగాల బారిన పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కోతి రాంపూర్‌లోని ఎన్జీఓల కాలనీలో కూడా కాలువల నిర్మాణంతో మురికి నీటిని మళ్లించగా, రోడ్డుపైకి చేరి వాసన భరించడం కష్టసాధ్యంగా మారిందని, బల్దియా సిబ్బంది నిత్యం గమనిస్తున్న మురుగు నీటి తరలింపు ప్రక్రియపై దృష్టి సారించడం లేదని, ఇప్పటికైనా స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కాలనీల వాసులు కోరుతున్నారు.
రోడ్ల పక్కనే చెత్తకుప్పలు
నగరాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు బల్దియా అధికారులు తాపత్రయ పడుతూ ఉండగా, సిబ్బంది నిర్లక్ష్యంతో పలు వీధులు కంపు కొడుతున్నాయ్. కాలనీల్లోని అంతర్గత వీధులు, శివారు ప్రాంతాల్లో రోడ్ల పక్కనే కుప్పలు తెప్పలుగా చెత్త పేరుకుపోగా, భరించరాని దుర్గంధంతో ముక్కు పుటాలు అదురుతున్నాయి. దీంతో ఆయాచోట్ల నుంచి వెళ్లేందుకు బాటసారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా బస్ స్టాండ్ వెనుకవైపు గల రహదారితో పాటు, దోబీవాడ, ఎల్ఐసీ డివిజన్ ఆఫీస్ పక్కన, కోతిరాంపూర్‌లోని గిద్దె పెరుమాళ్ల గుడి వెనుక వీధి, కురుమవాడ, భగత్ నగర్‌లోని శివాలయం వైపు వెళ్లే దారితో పాటు, శివారు ప్రాంతాల్లో కూడా చెత్త సేకరణ పట్ల బల్దియా సిబ్బంది నిర్లక్ష్యం కనబరుస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు దుర్గంధంతో సహవాసం చేస్తున్నారు.