NREGA పనులు పూర్తి చేయలేకపోతున్నాం: ధర్మాన ప్రసాదరావు
దిశ, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనులు చేస్తున్నవారంతా ఆర్ధికంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎస్ఎస్ఆర్ రేట్లు సరిగ్గా లేవంటూ ఎద్దేవా చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేకపోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ లోపాలను ప్రభుత్వం సవరించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం ధర్మాన మీడియాతో మాట్లాడుతూ..సిమెంట్ ధరలు బయట మార్కెట్‌లో మండిపోతున్నాయని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రజా […]
దిశ, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనులు చేస్తున్నవారంతా ఆర్ధికంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎస్ఎస్ఆర్ రేట్లు సరిగ్గా లేవంటూ ఎద్దేవా చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేకపోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ లోపాలను ప్రభుత్వం సవరించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం ధర్మాన మీడియాతో మాట్లాడుతూ..సిమెంట్ ధరలు బయట మార్కెట్‌లో మండిపోతున్నాయని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు పరువుకు పోయి చేపట్టిన పనులతో ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
మెప్పుకోసం తప్పుడు సలహాలివ్వద్దు
అధికారుల తీరుపై మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. మెప్పు కోసం తప్పుడు సలహాలను ప్రభుత్వ పెద్దలకు ఇవ్వొద్దని హితవు పలికారు. ప్రభుత్వ పనులు చేస్తున్న వారంతా ఆర్ధికంగా నష్టపోతున్నారని తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో సిమెంట్, స్టీల్, ఇటుక ధరలు మండిపోతున్నాయని చెప్పుకొచ్చారు. ఫలితంగా అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారులు ఇంజనీర్లపై ఒత్తిడి చేస్తే పనులు కావని పనులు చేసే వారంతా మద్యతరగతి వారే అని ఆయన తెలిపారు. ‘ఈ లోపాలను సరి చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నా. సకాలంలో పనులు పూర్తి కాక పేద జిల్లాలు మరింత నష్టపోతున్నాయి. వైసీపీ ప్రజా ప్రతినిధులు పరువుకు పోయి చేపట్టిన పనులతో ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలను తాను పంచాయితీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు ధర్మాన స్పష్టం చేశారు.
వలసలు ఆపలేకపోతున్నాం
శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు అట్టడుగున ఉన్నాయని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఆధునిక యుగంలో కూడా జిల్లా నుండి వేల మంది కార్మికులు వలస వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. వలసలు అరికట్టేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (NREGA)పథకం ప్రారంభించారని కాని ఈ పథకన్ని వినియోగించుకోవడంలో శ్రీకాకుళం జిల్లా అట్టడుగుస్థానంలో ఉంది. జిల్లా ప్రజల నుండి అనేక వినతులు వస్తున్నాయి. సచివాలయాలతో నరేగా ప్రకారం పనులు చేస్తున్నా, నిర్మాణాలు పూర్తి చేయలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుండి సిమెంట్ సరఫరా సరిగ్గా లేకపోవడం బయట మార్కెట్‌లో సిమెంట్ ధరలు అధికంగా ఉండటంతో జాతీయ ఉపాధి హమీ పథకాన్ని నరేగా జిల్లాలో సక్రమంగా అమలు చేయలేకపోతున్నామని పేద జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో సకాలంలో పనులు పూర్తికాకపోతే మరింత నష్టపోతామని ఉన్నతాధికారులు, ఇంజనీర్లపై నేతలు ఒత్తిడి తెస్తే తప్ప పనులు పూర్తి కావని మాజీమంత్రి ధర్మాన చెప్పుకొచ్చారు.
గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు
గతంలోనూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2020 జూలైలో జిల్లాల విభజన విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యతిరేకించారు. శాస్త్రీయంగా జిల్లాల విభజన జరగకపోతే ఇబ్బందులు ఎదురౌతాయని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ లేని శ్రీకాకుళం జిల్లాను ఊహించుకొంటేనే భయంగా ఉంటుందని ధర్మాన ప్రసాదరావు తన ఆవేదనను వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నానంటూనే జిల్లాల ఏర్పాటు విషయంలో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ హితవు పలికారు. నాడు ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా నరేగా పనుల విషయంలో చేసిన వ్యాఖ్యలు సైతం మరోసారి సంచలనంగా మారాయి.