పాలమూరులో కొత్తగా రెండు..

దిశ, మహబూబ్‌నగర్: పాలమూరులో కొత్తగా రెండు జలాశయాల ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానీటి వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టుల విషయం తెరపైకి వచ్చింది. 4 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు గట్టు ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని గతంలో సీఎం కేసీఆర్ పెంచి శంకుస్థాపన చేశారు. కానీ ప్రస్తుతం దానిని 4 టీఎంసీలకే పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. […]

Update: 2020-07-09 05:50 GMT

దిశ, మహబూబ్‌నగర్: పాలమూరులో కొత్తగా రెండు జలాశయాల ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానీటి వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టుల విషయం తెరపైకి వచ్చింది. 4 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు గట్టు ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని గతంలో సీఎం కేసీఆర్ పెంచి శంకుస్థాపన చేశారు. కానీ ప్రస్తుతం దానిని 4 టీఎంసీలకే పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఉమ్మడి పాలమూరు జిల్లాను మరోమారు ప్రభుత్వం నూతన ఎత్తిపోతల పథకాలు, జలాశయాల పేరుతో ఊరిస్తోంది. గతంలోనూ పలుమార్లు ఈ అంశం తెరమీదకు వచ్చినప్పటికీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా మరోమారు ఈ అంశం తెరమీదకు రావడంతో కృష్ణానది పరివాహాక రైతాంగంలో ఆశలు రేపుతున్నాయి. జిల్లాలోని జూరాల జలాశయం వద్ద మరో రిజర్వాయర్‌ను నిర్మించడం వల్ల తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తి స్థాయిలో వాడుకునే సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ముఖ్యంగా 20.5 టీంసీల సామర్థ్యం ఉన్న నెట్టెంపాడు పేరుతో ప్రతిపాదిస్తున్న రెండో జలాశయం నుంచే గట్టు ఎత్తిపోతల పథకానికి సైతం నీటిని తరలించే విధంగా జలాశయాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. 2018 జూన్ 29న సీఎం కేసీఆర్ హడావుడిగా గట్టు ఎత్తిపోతల పథకాన్ని 4టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం దీని సామర్థ్యాన్ని 4 టీఎంసీలకు తగ్గించడంతో పాటు జూరాల నుంచి రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా రెండు జలాశయాలను నింపేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఈ జలాశయాల కోసం నిధులు ఎక్కువగా అవసరం లేకపోవడం, ముంపు సైతం తక్కువగా ఉండటంతో దీనిపై సర్కారు సమాలోచనలు చేస్తోంది.

ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటిని సైతం పూర్తిస్థాయిలో వినియోగించుకునే ఆస్కారం ఉంది. ప్రస్తుతం నెట్టెంపాడు, గట్టు జలాశయాల నిర్మాణానికి దాదాపు రూ.6500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు వేశారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయినప్పటి నుంచి ప్రాజెక్టు పూడికతీత కార్యక్రమం చేపటకపోవడంతో ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిని నిల్వ (11.94 టీఎంసీల) ఉంచే పరిస్థితి లేదు. దీని కారణంగా జూరాల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో అటు తాగునీటి, సాగునీటి కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నూతన జలాశయాల నిర్మాణంతో కొంత వరకు నీటి సమస్యను తగ్గించుకునే అవకాశాలున్నాయి.

ప్రభుత్వం పరిశీలనలో ఉన్న ర్యాలంపాడు జలాశయం నుంచి 4 టీఎంసీల సామర్థ్యంతో గట్టు ఎత్తిపోతల పథకం నిర్మించాలని మొదట్లో భావించారు. వరదల సమయంలోనే నీటి ఎత్తిపోతకు వీలుంటుందన్న కారణంతో నేరుగా జూరాల జలాశయం నుంచే నీటిని తీసుకోవాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. దీంతో అప్పట్లో గట్టు ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచి, రూ.4500 కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 490 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్లాలంటే విద్యుత్ వినియోగం అధికమవుతుందనే కారణంతో గట్టు సామర్థ్యాన్ని తిరిగి 4 టీఎంసీలకు కుదించి 450 మీటర్ల వద్ద నిర్మించేలా డిజైన్‌ చేస్తున్నారు.

దీనికి జూరాల నుంచి కాకుండా కొత్తగా నిర్మించేందుకు యోచిస్తున్న నెట్టెంపాడు జలాశయం నుంచి నీటిని తీసుకోనేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో ప్రతిపాదించిన గట్టు ఎత్తిపోతల ప్రాంతంలో అవసరమైనంత భూమి అందుబాటులో ఉంది. కట్ట నిర్మాణానికి కొండలు అనుకూలంగా ఉన్నాయి. కానీ జూరాల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 400 మెగావాట్ల విద్యుత్ అవసరమనే కారణంతో దాని నుంచి వెనక్కు తగ్గుతున్నట్టు సమాచారం. కొత్త ప్రతిపాదనల్లో రెండు ఎత్తిపోతలకు కలిపి 226 మెగావాట్ల విద్యుత్తు వినియోగించే ఏడు పంపులు (5+2) ఏర్పాటు చేయనున్నారు. జూరాల నుంచి 310 మీటర్ల దిగువన నీటిని తీసుకుని 330 మీటర్ల వద్ద నెట్టెంపాడులోకి ఎత్తిపోస్తారు. ఇక్కడి నుంచి జూరాలకు తిరిగి నీటిని తీసుకునే క్రమంలో 60 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యేలా రివర్సబుల్‌ టర్బయిన్లను ఏర్పాటు చేయనున్నారు.

Tags:    

Similar News