టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రెండు ‘పౌరసత్వాలు’.. భారతీయుడైనా.?
దిశ, తెలంగాణ బ్యూరో : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని, అదే సమయంలో భారత్ పౌరసత్వం కూడా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా గుర్తింపు కార్డు తీసుకున్న సమయంలో కూడా చెన్నమనేని తన పౌరసత్వం జర్మనీకి చెందినదంటూ పేర్కొన్నారని హైకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఆయనకు ఉందని, జర్మనీ దేశం జారీ చేసిన పాస్‌పోర్టునే వినియోగిస్తున్నారని పేర్కొంది. జర్మనీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని, అదే సమయంలో భారత్ పౌరసత్వం కూడా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా గుర్తింపు కార్డు తీసుకున్న సమయంలో కూడా చెన్నమనేని తన పౌరసత్వం జర్మనీకి చెందినదంటూ పేర్కొన్నారని హైకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.
ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఆయనకు ఉందని, జర్మనీ దేశం జారీ చేసిన పాస్‌పోర్టునే వినియోగిస్తున్నారని పేర్కొంది. జర్మనీ విధానాల ప్రకారం ప్రతీ పదేళ్ళకోసారి పాస్‌పోర్టు రెన్యూవల్ గడువు ఉంటుందని, 2013లో తీసుకున్నందున 2023 వరకూ అది చెల్లుబాటులోనే ఉంటుందని పేర్కొంది. రెన్యూవల్ చేసుకునే సమయానికి ఆయన జర్మనీ పౌరులుగానే ఉన్నారని, అందువల్లనే ఆ దేశం రెన్యూవల్ చేసిందని వివరించింది. చెన్నమనేని పౌరసత్వంపై గత కొంతకాలంగా హైకోర్టులో జరుగుతున్న విచారణలో భాగంగా ఆ కేసుపై గురువారం వాదనలు జరిగిన సందర్భంగా కేంద్రం అఫిడవిట్ రూపంలో.. పై స్పష్టత ఇచ్చింది.
వీటితో పాటు పలు కీలక అంశాలనే అఫిడవిట్‌లో పొందుపర్చింది కేంద్రం. 2009లో భారత పౌరసత్వం పొందే నాటికే చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వం ఉందని వివరించింది. భారత పౌరసత్వం తీసుకునే సమయానికే ఆయన దగ్గర ఉన్న జర్మనీ పాస్‌పోర్టు గడువు 2013 వరకు ఉన్నట్లు చెన్నమనేని పేర్కొన్నారని గుర్తుచేసింది. జర్మనీలోని భారత ఎంబసీ కార్యాలయంలో 2019లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డును తీసుకున్న చెన్నమనేని ఇండియాలో బంధువులు ఉన్నారంటూ వివరాలు ఇచ్చారని గుర్తుచేసింది. ఓసీఐ కార్డు తీసుకునేనాటికే తన నేషనాలిటీని జర్మనీ అంటూ పేర్కొన్నారని వివరాలను అఫిడవిట్‌లో పేర్కొంది.
జర్మనీ పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన జర్మనీ పౌరులుగా పరిగణించలేమని జర్మనీ విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. కానీ జర్మనీ పాస్‌పోర్టు 10 ఏళ్ల గడువుతో ఇవ్వడం లేదా రెన్యూవల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈలోపు ఇతర దేశాల పౌరసత్వం తీసుకునే అవకాశం లేకపోలేదన్న విషయాన్ని కూడా జర్మనీ విదేశాంగ శాఖ వివరించింది. రెండు దేశాల పౌరసత్వం ఉన్నట్లు తేలితే మరోసారి పాస్‌పోర్ట్ రెన్యూవల్ చేయడం సాధ్యం కాదని కూడా జర్మనీ విదేశాంగ శాఖ స్పష్టం చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజా అఫిడవిట్‌లో నొక్కిచెప్పింది. కానీ చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం తీసుకున్న తర్వాత కూడా జర్మనీ పౌరసత్వాన్ని యధావిధిగా కొనసాగించారని అఫిడవిట్‌లో పేర్కొంది. జర్మనీ పౌరసత్వం ఇప్పటికీ ఉందని, రద్దు చేసుకోలేదని నొక్కిచెప్పింది.
2009లో భారత పౌరసత్వాన్ని తీసుకున్న చెన్నమనేని 2013లో జర్మనీ పాస్‌పోర్టును రెన్యూవల్ చేసుకున్నారంటే అప్పటికీ ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందనే స్పష్టమవుతోందని కేంద్రం వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ధాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు, లేవనెత్తిన విషయాలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను అప్పటికి వాయిదా వేసింది.