‘పర్ణశాల’ను పట్టించుకోవట్లే.. కళాహీనంగా సీతారాముల విగ్రహాలు

దిశ, దుమ్ముగూడెం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని దేవాలయంపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. శ్రీరాముడు వనవాసం చేసిన సమయంలో పంచవటి కుటీరాన్ని ఇక్కడే నిర్మించుకున్నారు. భద్రాచలం ఆలయానికి వచ్చే భక్తులందరూ పర్ణశాలలోనూ రామయ్యను దర్శించుకుని, ఇక్కడి గోదావరి ప్రాంతంలో బోట్ షికారు చేసి ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతారు. ఇంతటి ప్రాశస్త్యం, ప్రత్యేకతలున్న దేవాలయంపై అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తుండడంతో అభివృద్ధి జరగక, సరైన సౌకార్యాల్లేక భక్తులు […]

Update: 2021-10-02 06:22 GMT

దిశ, దుమ్ముగూడెం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని దేవాలయంపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. శ్రీరాముడు వనవాసం చేసిన సమయంలో పంచవటి కుటీరాన్ని ఇక్కడే నిర్మించుకున్నారు. భద్రాచలం ఆలయానికి వచ్చే భక్తులందరూ పర్ణశాలలోనూ రామయ్యను దర్శించుకుని, ఇక్కడి గోదావరి ప్రాంతంలో బోట్ షికారు చేసి ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతారు. ఇంతటి ప్రాశస్త్యం, ప్రత్యేకతలున్న దేవాలయంపై అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తుండడంతో అభివృద్ధి జరగక, సరైన సౌకార్యాల్లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామయ్య వనవాసం చేసిన సమయంలో కీలక ఘట్టాల ఇతివృత్తాన్ని తెలియచేసేలా పర్ణశాల ఆలయ ఆవరణలో విగ్రహాలు, కుటీరాన్ని ఏర్పాటు చేశారు. అయితే, రానురాను అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఇక్కడి విగ్రహాలు రంగు వెలిసిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి.

సుదూర ప్రాంతాల నుంచి రామయ్యను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇక్కడి పరిస్థితులను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్ణశాల దేవాలయానికి వివిధ రకాల వేలం పాటల ద్వారా ఏటా రూ. కోటి వరకు ఆదాయం సమకూరుతోంది. అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయకపోగా, శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు గ్రామస్తులు, భక్తుల నుంచి వస్తున్నాయి. పర్ణశాల గ్రామానికి చెందిన వ్యక్తిని భద్రాద్రి ఆలయ పాలక మండలిలోకి తీసుకుంటే తప్పా.. ఆలయ అభివృద్ధి సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. పర్ణశాల రామాలయంలో సిబ్బంది కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఆలయంలో నలుగురు అర్చకులకు గాను ముగ్గురే విధులు నిర్వర్తిస్తున్నారు. మరొకరిని భద్రాచలం నిత్యాన్నదాన సత్రానికి డిప్యూటేషన్‌పై పంపించారు. ఇక దేవాలయానికి సరిపడా స్థలం ఉన్నందున రాత్రివేళ భక్తులు బసచేసేలా కాటేజీలు నిర్మిస్తే అటు పర్యాటకులకు సౌకర్యంగా ఉండటంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. దీనితో పాటు గోదావరి నీటిమట్టం పెరిగితే అటు సీతమ్మ చీర దగ్గర పిల్ల వాగు పొంగి అక్కడ ఉన్న దుకాణాలు మునిగిపోతున్నాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

Tags:    

Similar News